వేలానికి ముకుతాడు
మోర్తాడ్: పంచాయతీ పదవుల వేలం వెర్రికి అధికార యంత్రాంగం ముకుతాడు వేస్తోంది. మూడో విడత ఎన్నికల్లో భాగంగా బాల్కొండ నియోజకవర్గంలోని పలు పంచాయతీల పరిధిలో వేలం పాట ద్వారా సర్పంచ్, వార్డు సభ్యులను ఎంపిక చేసినట్లు గుర్తించిన అధికారులు ఆయా గ్రామాల ప్రజలతో సమావేశమయ్యారు. తాజాగా భీమ్‌గల్ మండలంలోని సుదర్శన్ తండా, సంతోష్‌నగర్ తండాలలో వేలం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసినట్లు సమాచారం అందుకున్న ఎంపీడీవో సంతోష్‌కుమార్, ఎ స్సై సందీప్ గ్రామస్తులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. మోర్తాడ్ మండలం తిమ్మాపూర్‌లోనూ ఏకగ్రీవంగా ఎంపిక చేయడానికి రహస్యంగా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు ఆ సమావేశాన్ని అర్ధంతరంగా నిలిపివేశారు. సర్పంచ్ పదవికి తాము సూచించిన వ్యక్తి మాత్రమే నామినేషన్ వేయాలని సర్వసమాజ్ కమిటీ ప్రతినిధులు హుకుం జారీ చేసినట్లు తెలుసుకున్న పోలీసులు ఇది సరైన విధానం కాదని సూచించారు. చివరికి ఎవరైనా పోటీ చేయవచ్చని కమిటీ ప్రకటించడంతో ఏకగ్రీవానికి తెరపడింది. వేల్పూర్ మండలంలోని ఒక గ్రామంలో మాత్రం గురువారం సర్పంచ్ పదవికి వేలం నిర్వహించగా రూ.24 లక్షలకు ఒక అభ్యర్థి పదవిని దక్కించుకున్నాడు. ఏర్గట్ల మండలంలోని రెండు గ్రామాలలో ఇదే విధంగా వేలం నిర్వహించి సర్పంచ్ అభ్యర్థులను ఖరారు చేశారు. ఈ గ్రామాలలో వేలం ద్వారా రూ.20 లక్షలకు మించి ఆదాయం వీడీసీలకు లభించనుంది. అధికారులకు ఇంకా సమాచారం అందకపోవడంతో ఎలాంటి చర్యలు తీసుకోలేదని తెలుస్తోంది. కాగా, వేలం పాటల విషయం బహిరంగం అయిన చోటే అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు కావడంతో వేలం పాటల అంశంపై అధికారులు ఎలా స్పందిస్తారోననే చర్చ జరుగుతోంది.
సర్పంచ్, వార్డు సభ్యులను
ఏకగ్రీవం చేసే గ్రామాల్లో కౌన్సెలింగ్
వేలం నిర్వహించకుండా
అధికారుల పకడ్బందీ చర్యలు
నామినేషన్లు అంగీకరించబోమని
స్పష్టీకరణ


