భారీ ట్రక్కుపై అతిపెద్ద శివలింగం
● తమిళనాడు నుంచి బిహార్‌కు తరలింపు
● నిత్యం 80 కి.మీ ప్రయాణం
డిచ్‌పల్లి: డిచ్‌పల్లి పరిధిలోని 44 నంబర్ జాతీ య రహదారిపైన గురువారం భారీ ట్రక్కు (106 టైర్లు)పై అతిపెద్ద శివలింగం తరలిస్తుండగా పలువురు దర్శించుకొని, పూజలు చేశారు. సదరు శివలింగంను బీహార్ రాష్ట్రం ఉత్తర చంపారన్ జిల్లాలో మహవీర్ మందిర్ ట్రస్ట్ (పాట్నా) ఆధ్వర్యంలో నూతనంగా నిర్మిస్తున్న విరాట్ రామాయణ్ మందిర్‌లో ప్రతిష్ఠించేందుకు తమిళనాడు నుంచి తరలిస్తున్నారు. తమిళనాడు రాష్ట్రం మహాబలిపురం సమీపంలోని వట్టినాడు గ్రామ పరిధిలో ఈ శివలింగంను తయారు చేసినట్లు ట్రస్టు ప్రతినిధులు తెలిపారు. ఈ శివలింగం ప్రపంచంలోనే అతిపెద్ద శివలింగం అని తెలిపారు. 2015లో ఆర్డర్ ఇవ్వగా 2022 వరకు ఏకశిలగా ఉన్న కొండరాయిని తవ్వి బయటకు తీసినట్లు తెలిపారు. 2022 నుంచి 2025 నవంబర్ 19 వరకు శివలింగాన్ని తయారు చేశారని తెలిపారు. ఈ భారీ శివలింగంపై చుట్టూ 1008 లింగాలు చెక్కబడి ఉన్నాయి. రోజుకు సుమారు 80 కిలోమీటర్లు ప్రయాణిస్తున్నట్లు ట్రస్టు ప్రతినిధులు తెలిపారు. డిచ్‌పల్లి సమీపంలో ట్రక్కు ఆగడంతో ఈ శివలింగంను దర్శించుకున్న స్థానికులు కొబ్బరికాయలు కొట్టి పూజలు చేశారు.


