హత్యాయత్నం కేసులో ఇద్దరికి జైలు శిక్ష
నిజామాబాద్ లీగల్/నవీపేట: నవీపేట్ మండలం లింగాపుర్‌లో ఒకరిపై హత్యాయత్నం చేసిన ఇద్దరు వ్యక్తులకు నిజామాబాద్ అసిస్టెంట్ సెషన్స్ జడ్జి జైలు శిక్ష విధించారు. వివరాలు ఇలా.. లింగాపుర్ గ్రామంలోని కేశాపురం గంగారాం, గంగోనే హనుమాండ్లు అనే రైతుల పొలాలు పక్కపక్కనే ఉంటాయి. గంగారాం పొలంలో నీరు పారే భాగాన్ని అమ్మాలని హనుమాండ్లు అతని కొడుకు నవీన్ గతంలో అడిగారు. అందుకు గంగారాం అతని కుమారుడు మహేష్ నిరాకరించారు. దీంతో వారిపై నవీన్, హనుమాండ్లు కక్ష పెంచుకున్నారు. 2020 ఫిబ్రవరి 25న మహేష్‌పై నవీన్, హనుమాండ్లు గొడవ పడి, పారతో దాడి చేసి పారిపోయారు. ఈ ఘటనపై బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి, నిందితులను పట్టుకొని కోర్టులో హాజరు పర్చారు. జడ్జి విచారణ చేపట్టి నిందితులకు శిక్ష ఖరారు చేశారు. నవీన్‌కు ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, హనుమాండ్లుకు మూడేళ్ల కఠిన కారాగార శిక్షతోపాటు రూ.500 చొప్పున జరిమానా విధించారు. జరిమానా చెల్లించని పక్షంలో చెరో నెల రోజుల జైలు శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పారు.
ఆరు వాహనాలు సీజ్
ఆర్మూర్‌టౌన్: ఆర్మూర్ మున్సిపల్ పరిధిలోని మామిడిపల్లిలో మంగళవారం ఎంవీఐ రాహుల్‌కుమార్ వాహనాలను తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని ఒక పాఠశాల బస్సు, 5 ట్రాన్స్‌ఫోర్ట్ వాహనాలను సీజ్ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వాహనాల పత్రాలు అన్ని సరిగా ఉంటేనే రోడ్డుపై తీయలన్నారు. లేకుండా చట్టపరమైన చర్యలు తప్పవన్నారు.


