సమాజ శ్రేయస్సుకు పాటుపడాలి
మాక్లూర్: బిగాల బ్రదర్స్ స్ఫూర్తితో సమాజ శ్రేయస్సు కోసం ప్రతి ఒక్కరూ సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేపట్టాలని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆర్థికంగా, రాజకీయంగా బలపడి ఉన్నవారేందరో ఈ సమాజంలో ఉన్నా బిగాల బ్రదర్స్ వలే ఆలోచించకపోవటం విచారకరమని అన్నారు. సోమవారం మాక్లూర్ మండల కేంద్రంలో ప్రారంభించిన నూతన ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రారంభోత్సవానికి ఎమ్మెల్యే హాజరై మాట్లాడారు. నూతన పాఠశాల భవనానికి ప్రభుత్వం ఇచ్చిన రూ. 4 కోట్ల 70 లక్షల నిధులకు తోడు, స్థానికులైన బిగాల గణేశ్ గుప్తా, మహేశ్ గుప్తా రూ. ఒక కోటి విరాళం అందించడం అభినందనీయమని అన్నారు. అనంతరం రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థులు బాగా చదివి ఉన్నతస్థాయికి చేరుకోవాలన్నారు. ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎంత ఉన్నత స్థితికి చేరుకున్న స్వగ్రామాన్ని మరిచిపోకుండా గ్రామ అభివృద్ధికి పాటుపడటం బిగాల సోదరులకే దక్కుతుందన్నారు. వారి సేవాగుణం వెల కట్టలేనిదన్నారు. నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే బిగాల గణేశ్‌గుప్తా మాట్లాడుతూ.. మాక్లూర్ గ్రామాన్ని భవిషత్తులో మరింత అభివృద్ధి చేయటమే కాకుండా విద్యావంతుల గ్రామంగా తీర్చిదిద్దుతామని అన్నారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్మన్ దాదన్నగారి విఠల్‌రావు, జాయింట్ కలెక్టర్ కిరణ్‌కుమార్, డీఈవో అశోక్, ఎంఈవో సత్యనారాయణ, ఎంపీడీవో బ్రహ్మానందం, ఎంపీవో శ్రీనివాస్, నిజామాబాద్ మాజీ మేయర్ దండు నీతూకిరణ్, నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.


