 
															బాగ్దాద్‌లో ప్రమాదవశాత్తు ఆలూర్ వాసి మృతి
పెర్కిట్(ఆర్మూర్): ఇరాక్ దేశ రాజధాని బాగ్దాద్‌లో ఇటీవల జరిగిన ఓ ప్రమాదంలో ఆలూర్ మండల కేంద్రానికి చెందిన ఒకరు మృతిచెందారు. గ్రామస్తులు తెలిపిన వివరాలు ఇలా.. ఆలూర్‌కు చెందిన కుర్మె బీజ చిన్న రాజేష్(45) ఉపాధి నిమిత్తం బాగ్దాద్‌లోని ఒక నిర్మాణ కంపెనీలో కొన్ని సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. కాగా గురువారం బ్రిడ్జి నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో క్రేన్ ప్రమాదవశాత్తు రాజేష్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో అతడికి తీవ్ర గాయాలు కావడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న అతడి కుటుంబ సభ్యులు బోరున విలపించారు. మృతదేహాన్ని త్వరగా స్వగ్రామానికి చేర్చేందుకు కాంగ్రెస్ ఆర్మూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి వినయ్‌రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డిని ఆలూర్‌కు చెందిన నాయకులు కళ్లెం భోజారెడ్డి రాజేష్ సంప్రదించారు. మృతుడికి భార్య సునీత, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.
పెర్కిట్‌లో యాచకుడు..
ఆర్మూర్‌టౌన్: పెర్కిట్‌లోని హైవే కూడలి వద్ద ఓ యాచకుడు ప్రమాదవశాత్తు మృతిచెందినట్లు ఎస్‌హెచ్‌వో సత్యనారాయణగౌడ్ తెలిపారు. వివరాలు ఇలా.. మామిడిపల్లికి చెందిన బెల్లంపల్లి శివ(48) అనే యాచకుడు కొన్ని సంవత్సరాలుగా కుటుంబానికి దూరంగా ఉంటూ ఆర్మూర్‌తోపాటు మామిడిపల్లి, పెర్కిట్ గ్రామాల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రాత్రి సమయంలో పెర్కిట్ హైవే కూడలిలోని సిమెంటు దిమ్మైపె నిద్రిస్తుండే వాడు. కాగా శుక్రవారం ఉదయం సిమెంటు దిమ్మె వద్ద మృతి చెంది ఉండటంతో స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటన స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. మృతుడు ధరించిన టీషర్టు సిమెంటు దిమ్మెకు గల ఇనుప చువ్వకు తట్టుకుని గొంతుకు బిగుసుకుపోవడంతో మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతుడి కుమారుడు విజయ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.
 
							బాగ్దాద్‌లో ప్రమాదవశాత్తు ఆలూర్ వాసి మృతి

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
