‘ఇందిరమ్మ ఇళ్ల’కు పూర్తి సహకారం అందిస్తాం
● బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి
● జైతాపూర్‌లో ఇందిరమ్మ
ఇళ్ల గృహ ప్రవేశాలు
బోధన్: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు పూర్తి సహకారం అందిస్తామని బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్ రెడ్డి అన్నారు. ఎడపల్లి మండలం జైతాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద నిర్మాణాలు పూర్తి చేసుకున్న ఇళ్లను శనివారం కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, సబ్ కలెక్టర్ వికాస్‌మహతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తూ, ఐకేపీ, మెప్మా శాఖల ద్వారా రుణాలను మంజూరు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ తోడ్పాటును అందిపుచ్చుకుని ఇళ్ల నిర్మాణాలను త్వరితగతిని పూర్తి చేసుకోవాలని లబ్ధిదారులకు సూచించారు. గ్రామంలో పది మంది లబ్ధిదారులు ఇళ్ల నిర్మాణాలను పూర్తి చేసుకున్నారని, మరో 60 ఇళ్ల నిర్మాణాలు స్లాబ్ దశలో ఉన్నాయని తెలిపారు. గ్రామ ఆరోగ్య ఉపకేంద్రానికి విద్యుత్ సౌకర్యం, మహిళా శక్తి భవనానికి టాయిలెట్ల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. రాష్ట్ర సహకార సంఘాల యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి, గృహ నిర్మాణ శాఖ జిల్లా పీడీ పవన్ కుమార్, తహసీల్దార్ దత్తాద్రి, ఎంపీడీవో శంకర్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పులి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


