
ఎస్సారెస్పీకి 878 టీఎంసీల వరద
● ప్రాజెక్టు చరిత్రలో మూడో అత్యధికం
● 1983–84లో రికార్డు స్థాయిలో 1165 టీఎంసీలే ప్రథమం
బాల్కొండ: శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ప్రస్తుత సంవత్సరం ప్రాజెక్ట్ చరిత్రలోనే మూడో అత్యధిక వరద నీరు వచ్చి రికార్డును నెలకొల్పింది. 1983–84లో రికార్డు స్థాయిలో 1165 టీఎంసీలే ప్రథమస్థానంలో ఉండగా, 1988–89లో 912.95 టీఎంసీలతో రెండో స్థానంలో ఉంది. కాగా ప్రస్తుత సంవత్సరం (2025–26) 878 టీఎంసీల వరద నీరు వచ్చిచేరడంతో మూడో స్థానం సాధించింది. ఇదిలా ఉండగా ఎగువ ప్రాంతాల నుంచి గత నాలుగు రోజులుగా గోదావరి శాంతించింది. కనిష్టంగా 5464 క్యూసెక్కులకు వరద పడిపోయింది. మళ్లీ కొంత మేర పెరిగి9464 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుంది. కాలువల ద్వారా ఆయకట్టుకు నీటి విడుదల కొనసాగుతుంది. మరో పక్షం రోజులు గడిస్తే ఖరీఫ్ సీజన్ పంటలకు నీటి సరఫరా నిలిపి వేస్తారు. ఇప్పటి వరకు కాలువల ద్వారా, గోదావరిలోకి మొత్తం 810 టీఎంసీల నీటిని వదిలారు.
అధికంగా మహా వరద..
ప్రాజెక్టుకు గడిచిన పదేళ్లలో స్థానిక ఎగువ ప్రాంతాల నుంచే అధికంగా వరద నీరు వచ్చి చేరింది. కానీ ప్రస్తుత సంవత్సరం అధికంగా మహారాష్ట్ర ప్రాంతం నుంచే వరద నీరు వచ్చి చేరినట్లు ప్రాజెక్ట్ అధికారుల రికార్డులు తెలుపుతున్నాయి. ప్రస్తుత సంవత్సరం ప్రాజెక్ట్‌లోకి వచ్చిన 878 టీఎంసీల వరదలో 70 శాతం మేర నీరు మహారాష్ట్ర ప్రాంతం నుంచే వచ్చి చేరిందని రికార్డులు తెలుపుతున్నాయి. మరో వారం రోజులు గడిస్తే మహారాష్ట్ర ప్రాంతం నుంచి వచ్చే నీటికి బ్రేకులు పడుతాయి. అక్టోబర్ 28న బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను మూసి వేస్తారు.
కొనసాగుతున్న నీటి విడుదల
ప్రాజెక్ట్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 5 వేల క్యూసెక్కులు, ఎస్కెప్ గేట్ల ద్వారా 3 వేల క్యూసెక్కులు, సరస్వతి కాలువ ద్వారా 650 క్యూసెక్కులు, లక్ష్మి కాలువ ద్వారా 200 క్యూసెక్కులు, మిషన్ భగీరథ ద్వారా 231 క్యూసెక్కులు, ఆవిరి రూపంలో 573 క్యూసెక్కుల నీరు పోతుంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091(80.5 టీఎంసీలు)తో నిండుకుండలా ఉందని ప్రాజెక్ట్ అధికారులు తెలిపారు. ప్రస్తుత సంవత్సరం యాసంగీ సీజన్ ప్రారంభం వరకు కూడ ప్రాజెక్ట్ నిండుకుండల ఉండే అవకాశం ఉంది.