
యువత సన్మార్గంలో నడవాలి
మోపాల్(నిజామాబాద్‌రూరల్): యువత సన్మార్గంలో నడవాలని, అప్పుడే దేశ భవిష్యత్ బాగుంటుందని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అన్నారు. మోపాల్ పోలీసుల ఆధ్వర్యంలో మండల కేంద్రంలో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేశారు. 13 గ్రామాల నుంచి 13 టీములు పాల్గొనగా, నాలుగు రోజులపాటు టోర్నమెంట్ కొనసాగింది. ముగింపు కార్యక్రమానికి సీపీ ముఖ్యఅతిథిగా హాజరై, మాట్లాడారు. సమాజంలో యువత పెద్ద ఎత్తున మత్తుపదార్థాల వైపు ఆకర్షితమవుతోందని, ఇది ప్రమాదకరమని ఆవేదన వ్యక్తం చేశారు. క్రీడలు యువతను వ్యసనాల నుంచి దూరంగా ఉంచి, క్రమశిక్షణను, మానవతను నేర్పుతాయన్నారు. క్రికెట్ టోర్నమెంట్‌లో ఉత్సాహంగా పాల్గొని, ఆటలో స్ఫూర్తిని చూపినందుకు అభినందనలు తెలియజేశారు. యువత కోసం దసరా సెలవుల్లో క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటుచేసిన ఎస్‌ఐ జడ్ సుస్మితను అభినందించారు. అనంతరం విజేతలకు సీపీ బహుమతులు ప్రదానం చేశారు. ఏసీపీ రాజావెంకట్‌రెడ్డి, సౌత్ రూరల్ సీఐ ఎన్ సురేష్‌కుమార్, ఎస్‌ఐ సుస్మిత, యువకులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

యువత సన్మార్గంలో నడవాలి