
మహిళ దారుణ హత్య!
బోధన్: మహారాష్ట్రకు చెందిన ఓ మహిళ ఎడపల్లి మండలంలో దారుణ హత్యకు గురైన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఎడపల్లి ఎస్సై ముత్యాల రమ తెలిపిన వివరాలు ఇలా.. మహారాష్ట్ర ప్రాంతంలోని నాందేడ్ జిల్లా, బిలోలి తాలూకా, కొండల్‌వాడి గ్రామానికి చెందిన శీలంవార్ లింగవ్వ (55) బతుకమ్మ పండుగ కోసం కొన్నిరోజుల క్రితం ఎడపల్లి మండలంలోని జంలం గ్రామంలోని తన కూతురు ఇంటికి వచ్చింది. అనంతరం సెప్టెంబర్ 28న ఎడపల్లి మండలం పోచారం గ్రామంలోని తన చెల్లెలు కుమారుడైన బెజ్జంకి వెంకట్ వద్దకు బస్సులో బయలుదేరింది. ఆమె దూపల్లి గేట్ వద్దకు చేరుకోగా, అక్కడ గుర్తుతెలియని వ్యక్తి బైక్ మీద లిఫ్ట్ ఇచ్చాడు. ఆ వ్యక్తి అదను చూసి లింగవ్వ తలపై బలమైన ఆయుధంతో మోదీ హత్య చేశాడు. ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకొని, మృతదేహాన్ని జైతాపూర్ గ్రామ శివారులోని చెరుకుతోటలో పడేసి పారిపోయాడు. గురువారం అర్ధరాత్రి జైతాపూర్ గ్రామానికి చెందిన పురిమేటి బాలకృష్ణ అనే వ్యక్తి తన ఆటోలో మృతదేహాన్ని తరలిస్తుండగా గ్రామస్తులు పట్టుకున్నారు. మృతదేహం గోనె సంచిలో చుట్టి ఉండటంతో పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో ఉంది. ఈ విషయాన్ని గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈమేరకు నిందితుడిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఈ సంఘటనకు సంబంధించి పూర్తివివరాలు తెలియాల్సి ఉంది.