
అంతా ఒక్కటయ్యారు..!
డొంకేశ్వర్(ఆర్మూర్): ఈ ఏడాది చేప పిల్లల పంపిణీ కోసం ప్రభుత్వానికి కాంట్రాక్టర్లు సహకరించడం లేదు. పాత బకాయిలు ఇవ్వకపోవడంతో కాంట్రార్లందరూ ఒక్కటై టెండర్లకు దూరంగా ఉన్నారు. మొదటగా ఆగస్టు 18నుంచి సెప్టెంబర్ 1వ తేదీ వరకు రాష్ట్ర శాఖ ఈ–ప్రొక్యూర్‌మెంట్ ద్వారా టెండర్లను ఆహ్వానించగా, ఒక గుత్తేదారు కూడా బిడ్ దాఖలు చేయలేదు. దీంతో టెండర్ల గడువు తేదీని ఈ నెల 8వ తేదీ వరకు పొడగించింది. రెండోసారి పొడిగించిన గడువు సైతం ముగియగా కాంట్రాక్టర్లు బిడ్‌లు వేయలేదు. ప్రభుత్వం మళ్లీ ఈనెల 12వ తేదీ వరకు గడువును పెంచింది. మూడోసారైనా టెండర్లు దాఖలవుతాయో లేదో చూడాలి. గత రెండేళ్లలో చేప పిల్లలు సరఫరా చేసిన కాంట్రాక్టర్లకు బకాయి బిల్లులు రావాల్సి ఉంది. వాటిని చెల్లించకుండా ప్రభుత్వం ఈ ఏడాది టెండర్లు చేపట్టడంపై కాంట్రాక్టర్లు అసంతృప్తితో ఉన్నారని తెలిసింది. ఈ పరిస్థితి నిజామాబాద్ జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. జిల్లాకు సంబంధించిన కాంట్రాక్టర్లకు పాత బకాయిలు రూ.4కోట్లకు పైగా రావాల్సి ఉంది.
లక్ష్యం.. 4.54 కోట్ల చేప పిల్లలు..
ఈ ఏడాది జిల్లాలోని 976 చెరువుల్లో 4.54కోట్ల చేప పిల్లలు వదలాలని మత్స్య శాఖ లక్ష్యంగా పెట్టుకుని రాష్ట్ర శాఖకు ప్రతిపాదనలు పంపింది. ఇందులో 35 నుంచి 40ఎంఎం అలాగే 80 నుంచి 100 ఎంఎం చేప పిల్లలున్నాయి. వాస్తవానికి జూలైలో టెండర్లు పూర్తి చేసి ఆగస్టులో చేప పిల్లలను చెరువుల్లో వదలాలి. కానీ.. టెండరు ప్రక్రియను ప్రభుత్వం ఆలస్యం చేసింది. దీనికి తోడు కాంట్రాక్టర్లు టెండర్లు వేయకపోవడంతో మరింత ఆలస్యమవుతోంది. గడువు పొడిగించిన ప్రభుత్వం కొత్త గుత్తేదార్లను సముదాయించి టెండర్లు వేయించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. పెంచిన గడవు తేదీ వరకు కూడా ఎవరూ టెండరు వేయకపోతే చేప పిల్లల పంపిణీ మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. సెప్టెంబర్ నెలలోనే చెరువుల్లో చేప పిల్లలు వేయకపోతే అదును దాటి పోతుందని మత్స్యకారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతేడాది 4.45 కోట్ల చేప పిల్లలను 967 చెరువుల్లో వదలాలని లక్ష్యం ఉండగా, ప్రభుత్వం 1.92కోట్ల చేప పిల్లలను 799 చెరువుల్లో మాత్రమే పోసేందుకు అనుమతి ఇచ్చింది. మరి ఈ ఏడాది పూర్తి లక్ష్యానికి అనుమతి ఇస్తుందో లేదో వేచి చూడాలి.
టెండర్లే ఆలస్యం
ఈ ఏడాది చేప పిల్లలను చెరువుల్లో వదిలేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి పెట్టుకున్నాం. టెండర్ల ప్రక్రియ పూర్తయితే ప్రభుత్వం మార్గదర్శకాలు ఇస్తుంది. వాటి ప్రకారం కాంట్రాకర్ల ద్వారా చేప పిల్లలను పంపిణీ చేస్తాం.
– ఆంజనేయస్వామి,
జిల్లా మత్స్యశాఖ అధికారి
అదును దాటితే ఇబ్బందులు
గతేడాది కూడా చేప పిల్లలను ఆలస్యంగా చెరువుల్లో పోశారు. ఇప్పుడు కూడా అంతకు మించి ఆలస్యం చే స్తున్నారు. ప్రభుత్వం త్వర గా టెండర్లను పూర్తి చేసి చేప పిల్లలను పంపిణీ చేయాలి. ఇప్పటికే ఆలస్యం కాగా అదును దాటిపోతోంది. చెరువుల్లో లేటుగా పోస్తే చేప పిల్లల్లో సరైన ఎదుగుదల ఉండదు. – మోహన్, మత్స్యకారుడు, డొంకేశ్వర్
చేప పిల్లల పంపిణీ టెండర్లలో పాల్గొనని గుత్తేదార్లు
పాత బకాయిలు ఇవ్వడం లేదని
టెండర్లకు దూరం
మరోసారి 12వ తేదీ వరకు
గడువు పొడిగించిన ప్రభుత్వం
మరింత ఆలస్యమవుతున్న
చేపపిల్లల పంపిణీ
అదును దాటిపోతోందని
మత్స్యకారుల్లో ఆందోళన

అంతా ఒక్కటయ్యారు..!