
దక్కని ఆత్మీయ భరోసా
మోర్తాడ్(బాల్కొండ): మోర్తాడ్ మండలం గాండ్లపేట్‌కు చెందిన ఎల్లయ్య అనే ఉపాధి హామీ కూలీకి ఇందరమ్మ భరోసా సాయం మంజూరైనట్లు అధికారులు పత్రాన్ని అందజేశారు. నాటి నుంచి ప్రభుత్వం ఇచ్చే సాయం కోసం ఎల్లయ్యతోపాటు జిల్లా వ్యాప్తంగా అనేక మంది కూలీలు నిరీక్షిస్తున్నారు. భూమి లేని కూలీలకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద రెండు విడతల్లో రూ.6వేల చొప్పున సాయం అందించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. పథకాన్ని ఈ ఏడాది జనవరి 26న (గణతంత్ర దినోత్సవం సందర్భంగా) ప్రారంభించింది. ఒక్కో మండలం నుంచి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి అక్కడి ఉపాధి కూలీలకు సాయం అందించారు. ఆ తరువాత ఆత్మీయ భరోసా ఊసేలేకుండాపోయింది. అప్పట్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి సంబంధించి ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో సాయం సొమ్ము జమ చేయడానికి బ్రేక్ పడింది. అయితే ఎన్నికల తంతు ముగిసి కోడ్ ఎత్తివేసినా సాయం సొమ్మును విడుదల చేసే విషయంలో ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు స్పందన లేదు. జిల్లా వ్యాప్తంగా 38,787 మంది ఉపాధి కూలీలకు ఇందరమ్మ భరోసా సాయం అందించేందుకు అధికారులు ఎంపిక పూర్తి చేశారు. 31 మండలాల్లోని 31 గ్రామాల్లో కేవలం 1,675 మందికి మాత్రమే సాయం సొమ్మును ఖాతాల్లో జమ చేశారు. మిగిలిన గ్రామాల్లోని 37,112 మంది కూలీలకు సాయం అందించాల్సి ఉన్నా ఇప్పటి వరకు నిధులను ప్రభుత్వం విడుదల చేయలేదు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలులోకి తీసుకువచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో సాయం అందించే విషయాన్ని ప్రభుత్వం మరిచిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌తో బ్రేక్
ఆ తరువాత ఊసెత్తని ప్రభుత్వం
గణతంత్ర దినోత్సవాన ఇందిరమ్మ
ఆత్మీయ భరోసా ప్రారంభం
మండలానికి ఒక గ్రామంలో ఎంపిక చేసిన వారికి అందిన సాయం
మిగతా లబ్ధిదారుల ఎదురు చూపులు