
ఆగం చేసిన పెద్దవాగు
బాల్కొండ: బాల్కొండ నియోజకవర్గంలో ప్రవ హించే పెద్దవాగు వరద అన్నదాతలను ఆగం చేసింది. గురువారం మధ్యాహ్నం నుంచి క్రమంగా పెరిగిన పెద్దవాగు సాయంత్రానికి ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చింది. దీంతో పక్కన ఉన్న పంటలు నీట మునిగాయి. పసుపు పంటను ఆరబెట్టేందుకు తయారు చేసుకున్న కళ్లాలు కొట్టుకుపోయాయి. పసుపు ఉడికించేందుకు పెట్టిన కట్టెల కుప్పలు నీటి ప్రవాహానికి పెద్దవాగులో కలిసిపోయాయి. కట్టెల కోసం రైతులు శుక్రవారం ఉదయం నుంచి పెద్దవాగు పక్కన వెతకడం ప్రారంభించారు. ముప్కాల్ మండలం వెంచిర్యాల్, మెండోరా మండలం వెల్కటూర్‌లో రైతులకు భారీగా నష్టం జరిగింది.