
తాళం వేసిన ఇంట్లో చోరీ
వర్ని: మండలంలోని జాకోర గ్రామంలో తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగినట్లు వర్ని ఎస్సై మహేష్ తెలిపారు. గ్రామానికి చెందిన తేజస్విని మంగళవారం ఉదయం ఇంటికి తాళం వేసి, బంధువుల ఇంట్లో శుభకార్యానికి వెళ్లింది. సాయంత్రం ఆమె ఇంటికి తిరిగి రాగా, ఇంటి తాళంతోపాటు బీరువా తాళాలు పగలగొట్టి ఉండటం చూసి, చోరీ జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించగా, వారు ఘటనస్థలానికి చేరుకొని, వివరాలు సేకరించారు. గుర్తుతెలియని దుండగులు ఇంటి తాళాలు పగలగొట్టి రూ.15వేల నగదు, రెండు తులాల బంగారు గొలుసు చోరీ చేసినట్లు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
అటవీ భూమిని చదును చేస్తున్న ట్రాక్టర్లు సీజ్
ఇందల్వాయి: ధర్పల్లి మండలం గోవింద్‌పల్లి శివారులో అటవీ భూమిని చదును చేస్తున్న రెండు ట్రాక్టర్లను మంగళవారం సీజ్ చేసి ఇందల్వాయి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయానికి తరలించినట్లు ఎఫ్‌ఆర్‌వో రవి మోహన్ భట్ తెలిపారు. ట్రాక్టర్లను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన డిప్యూటీ రేంజ్ అధికారి తుకారం రాథోడ్, సెక్షన్ అధికారి అబ్దుల్ అతిఖ్, బీట్ అధికారులు నవీన్, ఖదీర్‌లను ఎఫ్‌ఆర్‌వో అభినందించారు.