
చిన్నారి కిడ్నాప్– హత్యకు కుట్ర
కామారెడ్డి క్రైమ్: పట్టణంలో మంగళవారం ఓ బాలిక కిడ్నాప్‌నకు గురికాగా, పోలీసులు 12 గంటల్లోగా కేసును ఛేదించి నిందితుడిని అరెస్టు చేశారు. వివరాలు ఇలా.. అశోక్ నగర్ కాలనీలో చిత్తు కాగితాలు ఏరుకునే మమత అనే వివాహిత మహిళకు రెండున్నర ఏళ్ల కుమార్తె కీర్తిక ఉంది. ఆమె తన భర్త చనిపోగా కుమార్తెతో కలిసి ఫుట్‌పాత్‌పైనే జీవనం సాగిస్తోంది. ఇటీవల ఆమెకు అశోక్ నగర్ కాల నీలోని కల్లు దుకాణంలో పనిచేసే పిల్లి రాజుతో పరిచయం ఏర్పడింది. కొద్దిరోజుల క్రితమే వారిద్దరూ ఆలయంలో పెళ్లి చేసుకుని కలిసి ఉంటున్నారు. కానీ మమత మరో వ్యక్తితో చనువుగా ఉండటంతో ఇద్దరి మధ్య గొడవలు జరిగాయి. దీంతో వారు వేర్వేరుగా ఉంటున్నారు. ఈక్రమంలో మమత సోమవారం రాత్రి తన కుమార్తెతో కలిసి అశోక్‌నగర్ కాలనీ ఫుట్‌పాత్‌పై నిద్రించింది. మంగళవారం ఉదయం ఆమె లేచి చూసేసరికి కుమార్తె కనబడకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టిన పోలీసులు సాయంత్రం మున్సిపల్ కార్యాలయం సమీపంలోని వైన్స్ వద్ద చిన్నారితో ఉన్న రాజును గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. అతడిని విచారించగా మద్యం సేవించిన అనంతరం పట్టణ శివారులోని చెట్ల పొదల్లోకి తీసుకువెళ్లి చిన్నారిని చంపేయాలని కిడ్నాప్ చేసినట్లు పేర్కొన్నాడు. మమతపై కక్ష పెంచుకున్న అతడు ఆమెను మనోవేదనకు గురి చేయాలని భావించి కీర్తికను చంపాలని పథకం వేసినట్లు తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు పట్టణ ఎస్‌హెచ్‌వో నరహరి తెలిపారు. చిన్నారిని తల్లి మమతకు అప్పగించారు.
నిందితుడిని పట్టుకున్న పోలీసులు
బాలిక తల్లి మరోవ్యక్తితో చనువుగా
ఉండటంతో కక్ష పెంచుకొని
పథకం పన్నిన రెండో భర్త