
సన్నబియ్యంతో రేషన్ కార్డుకు డిమాండ్
నిజామాబాద్ అర్బన్: గతంలో రేషన్ షాపులు, సరుకులపై ప్రజల్లో అంతగా ఆసక్తి ఉండేది కాదని, ప్రస్తుతం సన్న బియ్యం పంపిణీతో రేషన్ కార్డులకు విపరీతమైన డిమాండ్ పెరిగిందని రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరి కీ రేషన్ కార్డులు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 25 నుంచి వచ్చే నెల ఆగస్టు 10 వరకు అన్ని మండల కేంద్రాల్లో అధికారికంగా రేషన్ కార్డుల పంపిణీ కా ర్యక్రమం చేపట్టాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ నుంచి సోమవారం ఆయన, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు, ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి తదితరులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్ష జరిపారు. వ ర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, రేషన్ కార్డుల పంపిణీ, సాగునీటి వనరులు, ఎరువుల పంపిణీ పర్యవేక్షణ, సీజనల్ వ్యాధుల నియంత్రణ తదితర అంశాలపై కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. సీఎం మాట్లాడుతూ.. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాల్లో శాసనసభ్యులు, జిల్లా ఇన్‌చార్జి మంత్రులు విధిగా పాల్గొనాలని సూచించారు. అలాగే ప్రతి మండలంలో కలెక్టర్లు, అడిషనల్ కలెక్టర్లు పాల్గొనాలన్నారు. వర్షాల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని, ఎక్కడ కూడా ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వాతావరణ సూచనలకు అనుగుణంగా రైతులను, వివిధ వర్గాల ప్రజలను ముందుగానే అప్రమత్తం చేయాలన్నారు. పోలీస్ కమిషనరేట్లకు సంబంధించిన ఉన్నతాధికారులు కూడా క్షేత్రస్థాయిలో ఉంటూ పరిస్థితులను పర్యవేక్షించాలని సూచించారు. జిల్లాల్లో పిడుగుపాటుతో జరిగే నష్టాల వివరాలు సత్వరమే నమోదు చేస్తూ, బాధిత కుటుంబాలకు పరిహారం అందేలా చూడాలన్నారు. ప్రభుత్వ వైద్యశాలల్లో వైద్యులు ఎల్లవేళలా అందుబాటులో ఉండేలా పర్యవేక్షణ చేయాలని కలెక్టర్లకు సూచించారు. పశువులకు సంబంధించి వెటర్నరీ విభాగం కూడా అప్రమత్తంగా ఉండాలన్నారు. ఆస్పత్రులను కలెక్టర్లు ఆకస్మిక తనిఖీలు చేయాలని ఆదేశించారు. గత సీజన్‌లో 2 కోట్ల 85 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి చేసి దేశంలోనే తెలంగాణ నెంబర్ వన్‌గా నిలిచిందని, ఈసారి కూడా రైతులకు సాగునీరు ఇతర సౌకర్యాలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. యూరియా నిల్వలకు సంబంధించి ప్రతి ఎరువుల దుకాణం దగ్గర స్టాక్ వివరాలను బోర్డుపై తప్పనిసరిగా ప్రదర్శించేలా చర్యలు తీ సుకోవాలన్నారు. ఎరువుల కొరత ఉన్నట్లు కొంద రు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, నిజానికి రాష్ట్రంలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా సహా ఇతర ఎరువుల నిల్వలు అందుబాటులో ఉన్నాయన్నారు. యూరియా నిల్వలను ఇతర వ్యాపార అవసరాలకు మళ్లించకుండా పకడ్బందీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎరువుల పంపిణీకి సంబంధించి ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలన్నారు. వీసీలో కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఈ నెల 25 నుంచి అన్ని మండల
కేంద్రాల్లో పంపిణీ చేపట్టాలి
యూరియా నిల్వలు పక్కదారి
పట్టకుండా తగిన చర్యలు తీసుకోవాలి
భారీ వర్షాలపై అప్రమత్తంగా
వ్యవహరించాలి
కలెక్టర్లతో వీసీలో సీఎం రేవంత్‌రెడ్డి