
సోయా తగ్గింది.. మొక్కజొన్న పెరిగింది
మోర్తాడ్(బాల్కొండ): జిల్లాలో సోయా పంట సాగు విస్తీర్ణం తగ్గించిన రైతులు మొక్కజొన్నకు మొదటి ప్రాధాన్యత ఇచ్చారు. సోయా కంటే మొక్కజొన్న 15 వేల ఎకరాల్లో అదనంగా సాగు అవుతుండటమే ఇందుకు నిదర్శనం. ఈ వర్షాకాలం సీజన్ లో మొక్కజొన్న 47 వేల ఎకరాల్లో సాగు అవుతుండగా సోయా మాత్రం 32 వేల ఎకరాలకు పరిమి తమైంది. సోయా గింజలకు గత సీజనులో ఆశించిన ధర లభించలేదు. క్వింటాలుకు రూ.5 వేలకు మించి ధర దక్కకపోవడంతో సోయా సాగు విస్తీర్ణంను రైతులు తగ్గించారు. మక్కలకు క్వింటాలుకు రూ.2వేల నుంచి రూ.2,300ల వరకు ధర లభించడం మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరగడానికి కారణమైంది.
మక్కకు మనచోట డిమాండ్..
సోయా పరిశ్రమలు మన రాష్ట్రంలో ఎక్కువగా లేకపోవడంతో పొరుగు రాష్ట్రాలకు ఎగుమతి చేయా ల్సి ఉంది. మక్కలను పౌల్ట్రీ పరిశ్రమ, బిస్కెట్‌ల తయారీలో విరివిగా వినియోగిస్తారు. మక్కలకు మన చోటనే డిమాండ్ ఉండటంతో మొక్కజొన్న సాగు విస్తీర్ణం గతంలో కంటే పెరగడానికి అవకాశం ఏర్పడింది. ఒక ఎకరానికి మొక్కజొన్న దిగుబడి 25 క్వింటాళ్ల వరకు వస్తుండగా, సోయా మాత్రం 10 క్వింటాళ్ల నుంచి 12 క్వింటాళ్లే లభిస్తుంది. మక్కలకు మార్కెట్‌లో డిమాండ్ ఎప్పుడూ ఉండటంతో మొక్కజొన్న సాగుకే రైతులు మొగ్గుచూపుతున్నారు.
గత సీజన్‌లో సోయా ధర తగ్గడంతో
పంట సాగు విస్తీర్ణం తగ్గించిన రైతులు
15 వేల ఎకరాలు ఎక్కువ విస్తీర్ణంలో సాగవుతున్న మొక్కజొన్న
సోయా ధర తగ్గడంతోనే..
సోయా పంటకు గతంలో కంటే తక్కువ ధర లభిస్తుంది. ధర తగ్గిపోవడంతో సోయా సాగు చేయడంపై రైతులు ఆసక్తి చూపడం లేదు. సో యా కంటే మక్కలకు డి మాండ్ ఏర్పడటంతో మొక్కజొన్న సాగుకే రైతులు ఇష్టపడుతున్నారు. – రొక్కం మురళి,
విత్తనాభివృద్ధి సంస్థ డైరెక్టర్, తిమ్మాపూర్

సోయా తగ్గింది.. మొక్కజొన్న పెరిగింది