● గొట్టిముక్కలలో భయంగా
విధులు నిర్వహిస్తున్న పశువైద్యులు
● నూతన భవనం మంజూరు
చేయాలని వినతి
మాక్లూర్ : మండలంలోని గొట్టిముక్కల వెటర్నరీ సబ్‌సెంటర్ శిథిలావస్థకు చేరింది. ఏళ్లు గడుస్తున్న పాలకులు పట్టించుకోవడంలేదు. సబ్‌సెంటర్ ఎప్పుడు కూలుతుందో తెలియని దుస్థితిలో ఉండటంతో పశువైద్యులు భయం భయంగా విధులు నిర్వహిస్తున్నారు. సమీపంలోని 10 గ్రామాల రైతులు తమ పశువులను వైద్యం కోసం ఇక్కడికే తీసుకువస్తారు. ఈసబ్‌సెంటర్‌లో జూనియర్ పశువైద్యులు కల్యాణి, ఆఫీస్ సబార్డినేట్ శ్యామలలు పశువులకు వైద్యం అందిస్తున్నారు. సబ్‌సెంటర్ చుట్టూ పెద్ద చెట్లు, ముళ్లపొదలు, గడ్డిపెరిగిపోయి పాములు వస్తున్నాయి. గ్రామంలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారడంతో మురుగునీరు వచ్చి ఆస్పత్రి ప్రాంగణంలో నిలుస్తోంది. దీంతో దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నామని పశువైద్య సిబ్బంది వాపోతున్నారు. వర్షకాలంలో మరిన్ని ఇబ్బందులు పడాల్సి ఉంటుందని పశువైద్య సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాలకులు స్పందించి నూతన భవనం లేదా ఉన్న భవనానికి మరమ్మతులు చేయించాలని స్థానిక రైతులు, పశుపెంపకందారులు కోరుతున్నారు.
కొత్త భవనం నిర్మించాలి
సబ్‌సెంటర్ శిథిలావస్థకు చేరింది. నూతన భవనం నిర్మించడానికి ఎమ్మెల్యే రాకేశ్ రెడ్డి నిధులు మంజూరు చేయించాలి. నూతన భవనం నిర్మించాలి.
– గంగాధర్, రైతు, రాంపూర్