
నీరు నిల్వ ఉండకుండా చూడాలి
డిచ్‌పల్లి: వానకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై ప్రజలు అవగాహన కలిగి ఉండాలని మండల వైద్యాధికారిణి డాక్టర్ క్రిస్టినా సూచించారు. ఇందల్వాయి పీహెచ్ సీ ఆధ్వర్యంలో సోమవారం నడిపల్లి తండాలో ఉచిత ఆరోగ్య వైద్య శిబిరం నిర్వహించారు. జ్వరానికి సంబంధించి రక్త పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందజేశారు. తండాలో ఇంటింటికి తిరిగి నీరు నిల్వ ఉన్న ప్రాంతాలను గుర్తించి నీటిని తొలగించారు. ఈ సందర్భంగా డాక్టర్ క్రిస్టినా మాట్లాడుతూ.. నీరు నిల్వ ఉంటే దోమలు పెరిగి తద్వారా మలేరియా, డెంగీ, చికున్ గున్యా, ఫైలేరియా, మెదపువాపు తదితర వ్యాధులు వ్యాపిస్తాయన్నారు.
దోమలను నివారించేందుకు నిల్వ ఉన్న నీటిని తొలగించి ఇళ్ల చుట్టూ, పరిసర ప్రాంతాల్లో డెమో పాస్ స్ప్రే చేశామన్నారు. ఆశాకార్యకర్తలు అన్ని గ్రామాల్లో జ్వర సర్వే నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీవో శ్రీనివాస్ గౌడ్, ఆరోగ్య విస్తీర్ణాధికారి శంకర్, పంచాయతీ కార్యదర్శి జయశ్రీ, ఆరోగ్య పర్యవేక్షకులు అక్బర్‌అలీ, ఆరోగ్య కార్యకర్తలు వెంకట్ రెడ్డి, సుజాత, శోభ, మహాలక్ష్మీ, ఆశా కార్యకర్తలు సునీత, లత, విజయ తదితరులున్నారు.