
అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తాం
ఇందల్వాయి: అర్హులందరికీ రేషన్ కార్డులు ఇస్తామని రూరల్ ఎమ్మెల్యే డా. భూపతి రెడ్డి అన్నారు. మండలంలోని తిర్మన్‌పల్లి గ్రామంలో సోమవారం ఏర్పాటు చేసిన నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు 23,177 నూతన కార్డులు మంజూరు చేసినట్లు తెలిపారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం రేషన్ కార్డు లు ఇవ్వకుండా పేదలను మోసం చేసిందని విమర్శించారు. రేషన్ కార్డుల కోసం దళారులను ఆశ్రయించి డబ్బులు ఇవ్వవద్దని, మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకుంటే పారదర్శకంగా విచారణ చేసి కార్డులు జారీ చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు జరుగుతుండటమే నిదర్శనమన్నారు. కార్యక్రమంలో డీసీవో శ్రీనివాస్, తహసీల్దార్ వెంకట్‌రావు, ఏఎంసీ చైర్మన్ ముప్ప గంగారెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ తారాచంద్ నాయక్, పీసీసీ డెలిగేట్ శేఖర్ గౌడ్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు నవీన్ గౌడ్, ఇమ్మడి గోపి, సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.