
భూమి దక్కదేమోనని రైతు ఆత్మహత్య
కామారెడ్డి టౌన్: అప్పుల బాధతోపాటు భూమి కబ్జాకు గురైందన్న ఆవేదనతో ఓ రైతు సూసైడ్ నోట్ రాసి బలవన్మరణానికి పాల్పడ్డాడు. శాబ్ధిపూర్‌లో శనివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రేకులపల్లి కృష్ణారెడ్డి(56)కి 26 గుంటల భూమి ఉంది. అయితే ఈ భూమిని గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు కబ్జా చేశారు. సర్వే అధికారులు వచ్చి ఆ భూమి ముగ్గురు వ్యక్తుల కబ్జాలో ఉందని తేల్చారు. ఈ విషయంలో న్యాయం చేయాలని అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. ఓవైపు అప్పుల బాధలు.. మరోవైపు కబ్జాకు గురైన తన భూమి దక్కుతుందో లేదోనన్న ఆందోళనతో మానసికంగా కుంగిపోయాడు. శనివారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి భార్య లక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు.
సూసైడ్ నోట్‌లో..
రైతు కృష్ణారెడ్డి సూసైడ్ నోట్ రాశాడు. ఐదేళ్ల క్రితం రూ. 80 వేలు అప్పు తీసుకున్నానని, అది వడ్డీతో కలిపి రెట్టింపు అయ్యిందని తెలిపాడు. బాకీలు కట్టలేని పరిస్థితిలో ఉన్నానని, ఉన్న భూమి అమ్మి అప్పులు కడుదామంటే ముగ్గురు వ్యక్తులు(వారి పేర్లు రాశాడు) అమ్మనివ్వకుండా పోలీస్ స్టేషన్‌లో, కోర్టులో కేసు పెట్టారని పేర్కొన్నాడు. ఎస్సై, ఎస్పీ, తహసీల్దార్ దయతలచి తన కుటుంబానికి భూమి ఇప్పించాలని కోరాడు. భూమి గురించి భార్యతో రోజూ లొల్లి అవుతోందని, బాధతో ఆత్మహత్య చేసుకుంటున్నానని పేర్కొన్నాడు. తనను క్షమించాలని భార్య లక్ష్మిని సూసైడ్ నోట్‌లో కోరాడు.
అప్పులు, భూ వివాదాలే కారణమని సూసైడ్ నోట్
శాబ్ధిపూర్‌లో ఘటన