
విద్యారంగ సమస్యలపై ప్రభుత్వానికి నివేదిక
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ పరిధిలో గుర్తించిన క్షేత్రస్థాయి ఉన్నత విద్యారంగ సమస్యలను వివరిస్తూ ప్రభుత్వానికి సమగ్ర నివేదిక అందజేస్తామని రాష్ట్ర విద్యా కమిషన్ ఛైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఆకునూరి మురళి అన్నారు. కమిషన్ సభ్యుడు ప్రొఫెసర్ ఎల్.విశ్వేశ్వరరావుతో కలిసి యూనివర్సిటీని మురళి శనివారం సందర్శించారు. బాలికల, బాలుర వసతి గృహాలు, సెంట్రల్ లైబ్రరీ, వివిధ కళాశాలల తరగతి గదులు, ప్రయోగశాలలను పరిశీలించారు. అనంతరం తెయూ వీసీ ప్రొఫెసర్ టీ.యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఎం.యాదగిరి, కమిషన్ సభ్యులు విశ్వేశ్వరరావుతో కలిసి చైర్మన్ ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. తెయూకు ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలు మంజూరు చేయించాలని, నిర్మల్, ఆదిలాబాద్ జి ల్లాలను తెయూ పరిధిలోకి తేవాలని ఈ సందర్భంగా విద్యార్థులు విన్నవించారు. ముఖ్యంగా ఒకటే బాలికల హాస్టల్ ఉందని, మౌళిక వసతులు, గదు లు సరిపోక ఇబ్బందులు పడుతున్నామని, వెంటనే నూతన బాలికల హాస్టల్ నిర్మించాలని విద్యార్థినులు కోరారు. ప్రయోగశాలు, గ్రంథాలయంలో పుస్తకాల కొరత తదితర అంశాలను మురళి దృష్టికి తీసుకెళ్లారు. సివిల్ సర్వీసెస్, గ్రూప్స్ కోచింగ్ సెంటర్ ను ఏర్పాటు చేయాలని విన్నవించారు. తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (టూటా) అధ్యక్షులు ఏ.పున్నయ్య మాట్లాడుతూ.. ఉన్నత విద్యారంగంలో క్షేత్రస్థాయిలో అనేక సమస్యలున్నాయన్నారు. దశాబ్ద కాలంగా యూనివర్సిటీల్లో అధ్యాపకుల నియామకం జరగడంలేదన్నారు. తెయూ అనుబంధ కళాశాలల రాష్ట్ర సహాయ కార్యదర్శి జైపాల్ రెడ్డి మాట్లాడుతూ.. గత మూడు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని, దీంతో కళాశాలలు నిర్వహించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. దోస్త్, బకెట్ సిస్టం వంటి అడ్మిషన్స్ నిబంధనలతో ప్రైవేటు కళాశాలలు మూతపడే స్థితికి చేరుకున్నాయని తెలిపారు. ప్రిన్సిపాల్ మామిడాల ప్రవీణ్, కంట్రోలర్ ప్రొఫెసర్ కే.సంపత్‌కుమార్, ఆడిట్ సెల్ డైరక్టర్ ప్రొఫెసర్ ఘంటా చంద్రశేఖర్, ప్రొఫెసర్ కనకయ్య, వివిధ విభాగాల అధ్యాపకులు, బోధనేతర సిబ్బంది, ఔట్ సోర్సింగ్ సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్
ఆకునూరి మురళి
తెయూలో ప్రజావాణి నిర్వహణ
సమస్యలు వివరించిన విద్యార్థులు,
అధ్యాపకులు