
బకాయి వేతనాలు చెల్లించాలి
● ఎన్డీఎస్‌ఎల్ ఎదుట కార్మిక సంఘాల నిరసన
బోధన్: పదేళ్ల బకాయి వేతనాలు చెల్లించి ఆదుకోవాలని పట్టణ కేంద్రంలోని శక్కర్‌నగర్ ఎన్‌డీఎస్‌ఎల్ (నిజాం దక్కన్ షుగర్స్ లిమిటెడ్) ఎదుట కార్మిక సంఘాలు, రైతు నాయకులు శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ 2015 డిసెంబర్ 23న అక్రమంగా లేఆఫ్ ప్రకటించి షుగర్ ఫ్యాక్టరీని మూసివేయడంతో ఉపాధి కోల్పోయామని, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం కారణాలతో దుర్భర జీవితాలు గడుపుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు, పిల్లల పోషణకు నరకయాతన పడుతున్నామని పేర్కొన్నారు. బకాయివేతనాలు చెల్లించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన షుగర్ ఫ్యాక్టరీ పునరుద్ధరణ కమిటీ కాలయాపన కమిటీగా ఉందని ఆరోపించారు. ఫ్యాక్టరీని పున: ప్రారంభించాలని తెలిపారు. కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు ఉపేందర్, రవిశంకర్‌గౌడ్, సత్యనారాయణ, శ్రీనివాస్, భిక్షపతి, రైతు నాయకుడు కేపీ శ్రీనివాస్ రెడ్డి, ఫయాజ్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.