
పరిసరాల శుభ్రతతోనే ఆరోగ్యం
● కాల్పోల్‌లో వైద్యుల బృందం పర్యటన
మోపాల్(నిజామాబాద్‌రూరల్): గ్రామీణ ప్రాంతాల్లోని పరిసరాలు శుభ్రంగా ఉన్నప్పుడే ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు బృందం సూచించింది. మండలంలోని కాల్పోల్‌లో డెంగీ కేసులు నమోదైన నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. వైద్య బృందాలను శనివారం గ్రామానికి పంపింది. దీంతో వైద్య బృందాలు గ్రామంలో పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించాయి. ప్రధానంగా వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేస్తూ, దోమల లార్వా నిర్మూలనకు మందును స్ప్రే చేశారు. గ్రామంలో ఆరోగ్య శిబిరం నిర్వహించి జ్వర పీడితులను పరీక్షించి మందులను అందజేశారు. మెరుగైన చికిత్స అవసరమున్న వారిని జీజీహెచ్‌కు సిఫారసు చేశారు. కార్యక్రమంలో జిల్లా మలేరియా అధికారి డాక్టర్ తుకా రాం రాథోడ్, వైద్యులు ప్రత్యేష, అజ్మల్, హెచ్‌ఈవో గోవర్ధన్,సూపరింటెండెంట్లు,ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు పాల్గొన్నారు.
మదన్‌పల్లిలో ఒకరికి డెంగీ
మాక్లూర్: మండలంలోని మదన్‌పల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ డెంగీ బారినపడింది. విషయం తెలుసుకున్న కల్లెడి పీహెచ్‌సీ వైద్యుడు ప్రకాశ్ అప్రమత్తమై ఆరోగ్య సిబ్బందితో కలిసి శనివారం మదన్‌పల్లిలో వైద్య శిబిరం నిర్వహించారు. సుమారు 20 మందికి రక్త పరీక్షలు నిర్వహించగా, జ్వరం, డెంగీ లక్షణాలు కనిపించలేదు. కాగా, 15 రోజుల క్రితం సదరు మహిళ బోధన్‌లో ఉండే తన తల్లి వద్దకు వెళ్లింది. తిరిగి మదన్‌పల్లి వచ్చిన తర్వాత విపరీతమైన జ్వరం, తలనొప్పి రావటంతో జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లింది. అక్కడ జరిపిన రక్త పరీక్షలో డెంగీ పాజిటీవ్ రావడంతో చికిత్స పొంది మదన్‌పల్లి చేరుకుంది. విషయం తెలియడంతో డాక్టర్ ప్రకాశ్ వెంటనే గ్రామంలో ఉన్న డ్రెయినేజీలను శుభ్రం చేయించారు. బోధన్‌లో దోమ కుట్టడంతోనే డెంగీ వచ్చినట్టు డాక్టర్ అ నుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం డెంగీ తగ్గడంతో విశ్రాంతి తీసుకుంటున్న మహిళను ఎంపీడీవో బ్రహ్మానందం పరామర్శించారు.

పరిసరాల శుభ్రతతోనే ఆరోగ్యం