
విద్యార్థులు కావలెను
మోర్తాడ్: ఎస్సీ విద్యార్థి వసతి గృహాలలో సీట్లు భర్తీ కాక వెలవెలబోతున్నాయి. గురుకుల పాఠశాలల్లో చేరడానికి విద్యార్థులు ఆసక్తి చూపడంతో వసతి గృహాలలో సీట్లు నిండటం లేదు. ఆర్మూర్ డివిజన్‌లోని పలు వసతి గృహాలలో సీట్లు ఖాళీగా ఉండటంతో వాటిని భర్తీ చేసేందుకు ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు అవస్థలు పడుతున్నారు. ఒక్కో హాస్టల్‌లో వంద మంది విద్యార్థులకు వసతి కల్పించే వీలు ఉంది. కొన్ని హాస్టళ్లలో సీట్లు నిండిపోగా, ఎక్కువ వసతి గృహాలలో ఖాళీలే దర్శనం ఇస్తున్నాయి. విద్యార్థులకు నాణ్యమైన భోజనంతోపాటు దుస్తులు, దుప్పట్లు, ఉచిత నోట్ పుస్తకాలు అందిస్తూ కాస్మెటిక్ చార్జీలను చెల్లిస్తున్నారు. మోర్తాడ్‌లోని బాలుర, బాలికల వసతి గృహాలతోపాటు వేల్పూర్, తొర్లికొండ, కోనసముందర్, ఆర్మూర్‌లోని బాలుర వసతి గృహాలలో సీట్లు భర్తీ అయ్యాయి. కాగా, ఏర్గట్లలో(30), చౌట్‌పల్లి(30), భీమ్‌గల్ బాలికల వసతి గృహంలో(35), బాలుర(50), ఆర్మూర్‌లోని బాలికల వసతి గృహంలో(50) సీట్లు ఖాళీగా ఉన్నాయి.
● ఎస్సీ వసతి గృహాలలో భారీగా ఖాళీలు
● గురుకులాల్లో చేరికకు ఉత్సాహం చూపడంతో భర్తీకాని సీట్లు
మెరుగైన వసతులున్నాయి..
ఎస్సీ విద్యార్థి వసతి గృహాలలో మెరుగైన వసతులు కల్పిస్తున్నాం. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే ఎస్సీ, బీసీ, ఎస్టీ విద్యార్థులు అందుబాటులో ఉన్న ఎస్సీ వసతి గృహాలలో చేరితే ఉపయోగంగా ఉంటుంది.ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి ప్రయత్నిస్తున్నాం.
– రాజగంగారాం, ఏఎస్‌డబ్ల్యూ, ఎస్సీ సంక్షేమ శాఖ