
పథకం ప్రకారమే కోనాపూర్ దారి దోపిడీ
కమ్మర్‌పల్లి: మండలంలోని కోనాపూర్ గ్రామ శివారులో బుధవారం జరిగిన దారి దోపిడీ అంతా పథకం ప్రకారమే జరిగిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. ఈ ఘటనలో బాధితుడి వెంట వచ్చిన వ్యక్తే కుట్రదారుడు కాగా, మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి కుట్ర పన్ని దోపిడీకి పాల్పడ్డారు. నిందితులను అరె స్టు చేశారు. కమ్మర్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం భీమ్‌గల్ సీఐ పొన్నం సత్యనారాయణ వివరాలను వెల్లడించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం జోగినపల్లికి చెందిన కొమ్ము లక్ష్మీనారాయణ అనే వ్యక్తి వరికోత యంత్రం కొనుగోలు చేయడానికి రూ. 3.50 లక్షల నగదుతో భీమ్‌గల్ మండలం పల్లికొండకు ఈనెల 16న బయలుదేరాడు. అతడికి తోడుగా తెలిసిన వ్యక్తి బోదాసు జలంధర్‌ను వెంట తీసుకెళ్లాడు. జలంధర్ ఆ డబ్బులను కాజేయాలని కుట్ర పన్ని ఈ విషయాన్ని కొన్ని రోజులకు ముందే గుంటూర్ జిల్లా సత్తెనపల్లెలో ఉండే వరుసకు అన్నయ్య అయ్యే బోదాసు రాజశేఖర్‌కు ఫోన్‌లో సమాచారం అందించాడు. ఈ విషయం రాజశేఖర్ తన బావమరిది ప్రసాద్‌కు చెప్పి కుట్రపన్నారు. ఈక్రమంలో జలంధర్ వారిని కోరుట్ల ప్రాంతానికి రప్పించాడు. అనంతరం జలంధర్ లక్ష్మీనారాయణతో కలిసి బైక్‌పై పల్లికొండకు బయలుదేరారు. కోనాపూర్ శివారులోని అటవీ ప్రాంతానికి చేరుకోగానే, అక్కడే మాటు వేసి ఉన్న రాజశేఖర్, ప్రసాద్‌లు స్కూటీపై వచ్చి వారి బైక్‌ను అడ్డగించారు. కత్తులు చూపి బెదిరించి లక్ష్మీనారాయణ వద్ద నుంచి రూ. 3.50 లక్షల నగదు, రెండు మొబైల్ ఫోన్‌లు ఎత్తుకెళ్లారు. జలంధర్‌పై అనుమానంతో దర్యాప్తు చేసిన పోలీసులు సాంకేతిక సహాయంతో సమాచారం సేకరించారు. మెట్‌పల్లి లాడ్జీలో ఉన్న జలంధర్, బోదాసు రాజశేఖర్, ప్రసాద్‌లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న రూ. 3.45 లక్షల నగదు, కత్తి, స్కూటీ, మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. దోపిడీకి పాల్పడింది తామేనని నిందితులు అంగీకరించనట్లు సీఐ పేర్కొన్నారు. కేసు ఛేదనలో చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై అనిల్‌రెడ్డిని, ఐడీ పార్టీ కానిస్టేబుళ్లను సీఐ అభినందించారు.
ముగ్గురు నిందితుల అరెస్ట్
నగదు, మొబైల్ ఫోన్లు స్వాధీనం