బొలెరో వాహనం బోల్తా | - | Sakshi
Sakshi News home page

బొలెరో వాహనం బోల్తా

Jul 16 2025 4:11 AM | Updated on Jul 16 2025 4:11 AM

బొలెర

బొలెరో వాహనం బోల్తా

నిజాంసాగర్‌(జుక్కల్‌): మండలంలోని నాందేడ్‌–సంగారెడ్డి జాతీయ రహదారిపై మంగళవారం సిమెంట్‌ లోడ్‌తో వెళ్తున్న బొలెరో వాహనం ప్రమాదవశాత్తు బోల్తాపడింది. సంగారెడ్డి జిల్లా బాచేపల్లి నుంచి సిమెంట్‌ లోడ్‌ వస్తున్న బొలెరో వాహనం మండలంలోని వెల్గనూర్‌ గ్రామ శివారులోని జాతీయ రహదారిపై అదుపుతప్పి, రోడ్డు కిందకు వెళ్లి పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో వాహన డ్రైవర్‌తోపాటు మరో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయని హైవే సిబ్బంది తెలిపారు.

సిమెంట్‌ దుకాణంలో అగ్ని ప్రమాదం

బాల్కొండ: మండల కేంద్రంలోని శాంభవి సిమెంట్‌ దుకాణంలో సోమవారం అర్ధరాత్రి తర్వాత షార్ట్‌ సర్క్యుట్‌తో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. 10 లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. అర్ధరాత్రి దుకాణం నుంచి మంటలు వ్యాపించడంతో స్థానికులు గమనించి ఫైర్‌ స్టేషన్‌కు సమాచారమందించారు. వెంటనే ఫైర్‌సిబ్బంది ఫైర్‌ ఇంజిన్‌తో వచ్చి మంటలను ఆర్పివేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

చేనులో మూర్చతో రైతు మృతి

లింగంపేట(ఎల్లారెడ్డి): పంట చేనులో పనులు చేస్తుండగా ఓ రైతు మూర్ఛ వ్యాధితో మృతిచెందిన ఘటన మండలంలోని శెట్పల్లిసంగారెడ్డి గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్సై దీపక్‌కుమార్‌ తెలిపిన వివరాలు ఇలా.. శెట్పల్లిసంగారెడ్డి గ్రామానికి చెందిన మార్గ రాజు(38) అనే రైతు సోమవారం తన పంట చేనులో పొలం దున్నడానికి వెళ్లాడు. రాత్రి వరకు అతడు ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు పొలం వద్దకు వెళ్లి, వెతకసాగారు. పొలంలో రాజు మూర్చతో బోర్లా పడిఉన్నట్లు గమనించారు. అతడిని లేపి చూడగా అప్పటికే ప్రాణాలు పోయినట్లు గుర్తించారు. మృతుడి కుటుంబసభ్యులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. తన భర్త మరణంలో ఎలాంటి అనుమానాలు లేవని అతడి భార్య ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు.

తాళం వేసిన ఇంట్లో చోరీ

వర్ని: మండలంలోని శంకోరా గ్రామంలో తాళం వేసిన ఓ ఇంట్లో చోరీ జరిగింది. వర్ని ఎస్సై మహేష్‌ తెలిపిన వివరాలు ఇలా.. శంకోరా గ్రామానికి చెందిన పాల్త్య రవీందర్‌ ఈనెల 13న ఇంటికి తాళం వేసి బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి మంగళవారం ఇంటికి రాగా, ఇంటి తాళాలతోపాటు బీరువా తాళాలు పగలగొట్టి ఉండటంతో చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి రెండు తులాల బంగారం, 30 తులాల వెండి, రూ.18 వేల నగదును ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

బొలెరో వాహనం బోల్తా
1
1/2

బొలెరో వాహనం బోల్తా

బొలెరో వాహనం బోల్తా
2
2/2

బొలెరో వాహనం బోల్తా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement