
నేడు తెయూ కాన్వొకేషన్
తెయూ(డిచ్‌పల్లి): తెలంగాణ యూనివర్సిటీ రెండో కాన్వొకేషన్ బుధవారం ఘనంగా నిర్వహించనున్నారు. వర్సిటీ చాన్స్‌లర్, రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరు కానున్నారని, ఏర్పాట్లను పూర్తి చేశామని వైస్ చాన్స్‌లర్ టీ.యాదగిరిరావు తెలిపారు. రాజ్‌భవన్ నుంచి వచ్చిన పోలీసు అధికారులు, నిజామాబాద్ సీపీ సాయిచైతన్య మంగళవారం క్యాంపస్‌ను సందర్శించి కాన్వొకేషన్ వేదిక వద్ద భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. స్పిఫర్ డాగ్ స్క్వాడ్ బృందం, బాంబ్ డిస్పొజబుల్ టీం అధికారులు వేదికను నిశితంగా తనిఖీ చేశారు. డిచ్‌పల్లి మండల కేంద్రంలోని తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక పోలీస్ ఏడో బెటాలియన్‌కు చెందిన సిబ్బంది, బ్యాండ్ టీం గవర్నర్‌కు గౌరవ వందనం (గార్డ్ ఆఫ్ హానర్) సమర్పించనున్నారు. రిహార్సల్స్‌లో భాగంగా ఆర్‌ఎస్సై కే.శ్రీకాంత్ ఆధ్వర్యంలో తెయూ వీసీ యాదగిరిరావు, సీపీ సాయిచైతన్యకు గౌరవ వందనం సమర్పించారు. వీసీ ప్రొఫెసర్ టీ.యాదగిరిరావు, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ యాదగిరి, కంట్రోలర్ ప్రొఫెసర్ సంపత్‌కుమార్, డీన్స్‌లతో కలిపి మాక్ సెషన్ నిర్వహించారు. మాక్ డ్రిల్‌లో కాన్వొకేషన్ నిర్వహణ కమిటీల కన్వీనర్లు, ప్రొఫెసర్‌లు ఘంటా చంద్రశేఖర్, కనకయ్య, అపర్ణ, ఆరతి, రాంబాబు, ఆంజనేయులు, కె.రవీందర్ రెడ్డి, ప్రిన్సిపాల్ ప్రవీణ్ మామిడాల, అసోసియేట్ ప్రొఫెసర్ నాగరాజు, పీఆర్వో ఏ.పున్నయ్య, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.
గవర్నర్ పర్యటన సాగుతుందిలా..
గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ బుధవారం ఉదయం 8.30 గంటలకు రాజ్‌భవన్ నుంచి రోడ్డుమార్గం ద్వారా బయల్దేరి 11.10 గంటలకు డిచ్‌పల్లిలోని టీజీఎస్పీ ఏడో బెటాలియన్‌కు చేరుకుంటారు. బెటాలియన్‌లో పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన తర్వాత 15 నిమిషాలు విశ్రాంతి తీసుకుంటారు. 11.25 గంటలకు బెటాలియన్ నుంచి బయల్దేరి 11.30 గంటలకు తెలంగాణ యూనివర్సిటీకి చేరుకుంటారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు తెయూ కాన్వొకేషన్‌లో పాల్గొంటారు. వర్సిటీ నుంచి 1.05 గంటలకు బయల్దేరి 1.10 గంటలకు బెటాలియన్‌కు చేరుకుని అక్కడే భోజనం చేస్తారు.
మధ్యాహ్నం 2.30 గంటలకు బెటాలియన్ నుంచి బయల్దేరి 2.50 గంటలకు నిజామాబాద్ జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకుంటారు. 3 నుంచి 4 గంటల వరకు జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డు గ్రహీతలైన రచయితలు, కళాకారులతో మాట్లాడుతారు. సాయంత్రం 4 నుంచి 4.30 గంటల వరకు జిల్లా టీబీ అధికారులు, ఐఆర్‌సీఎస్ ప్రతినిధులతో సమావేశమవుతారు. 4.30 నుంచి 4.45 గంటల వరకు విశ్రాంతి తీసుకుని 4.45 గంటలకు హైదరాబాద్‌కు బయల్దేరుతారు.
రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ రాక
భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన సీపీ
130 మంది విద్యార్థులు.. 157 మంది పరిశోధకులు
2014 నుంచి 2023 వరకు 15 పోసు్ట్రగాడ్యుయేట్ (పీజీ) విభాగాల్లో ఉత్తమ ప్రతిభ చూపిన 130 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, 18 విభాగాల్లో పరిశోధనలు పూర్తి చేసుకున్న 157 మందికి అధికారికంగా పీహెచ్‌డీ పట్టాలను అందజేస్తారు. బంగారు పతకాలను, పీహెచ్‌డీ డాక్టరేట్ పట్టాలను గవర్నర్ తో పాటు ముఖ్యఅతిథి చేతుల మీదుగా అందజేసి సత్కరిస్తారు.

నేడు తెయూ కాన్వొకేషన్