
ప్రజావాణికి ప్రాధాన్యమివ్వాలి
నిజామాబాద్‌అర్బన్: ప్రజావాణి కార్యక్రమానికి ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని అదనపు కలెక్టర్లు అంకిత్, కిరణ్ కుమార్ అధికారులకు సూచించారు. కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 94 ఫిర్యాదులు వచ్చాయి. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు తమ సమస్యలను అదనపు కలెక్టర్లతోపాటు మెప్మా పీడీ రాజేందర్, నగర పాలక సంస్థ కమిషనర్ దిలీప్ కుమార్‌లకు విన్నవించారు.
ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలి
జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని బీసీ, ఎస్సీ, ఏస్టీ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం అదనపు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. ఉచిత బస్సు సౌకర్యంతో విద్యార్థులకు మేలు కలుగుతుందని, పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుందన్నారు. కార్యక్రమంలో జేఏసీ నాయకులు మహిపాల్, సుమన్, ప్రేమ్ పాల్గొన్నారు.
అధికారులపై చర్యలు తీసుకోవాలి
నగరంలోని ఆర్టీసీ– 2 డిపోకు రూ.2కోట్ల మేర నష్టం కలిగించిన మున్సిపల్, విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని న్యాల్‌కల్ రోడ్‌కు చెందిన స్థానికులు పలువురు అదనపు కలెక్టర్ కిరణ్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. ఆర్టీసీ డిపోకు 33/11 కేవీ విద్యుత్ లైన్‌ను ప్రైవేటు ప్లాట్ల స్థలాల గుండా వేయిస్తూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. ప్రధాన రోడ్డు గుండా వేయాల్సిన లైన్‌ను ప్లాట్ల గుండా వేసి ప్రజాధనం రూ.2కోట్లు వృథా చేశారన్నారు. దీనిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలన్నారు.
అదనపు కలెక్టర్లు
అంకిత్, కిరణ్‌కుమార్
94 ఫిర్యాదులు స్వీకరించిన
అధికారులు