
పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా నారాయణ
నిజామాబాద్‌నాగారం: తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడిగా మైసల నారాయణను మంగళవారం ఎన్నుకున్నారు. నగరంలోని ఖలీల్‌వాడిలో జిల్లా పద్మశాలి సంఘ కార్యవర్గ సమావేశం గౌరవ అధ్యక్షుడు, అఖిల భారత పద్మశాలి సంఘం సెంట్రల్ బోర్డు సభ్యుడు దాసరి నర్సింలు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడిగా రిటైర్డ్ తహసీల్దార్ మైసల నారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకొని ఘనంగా సన్మానించారు. అనంతరం నారాయణకు జిల్లా అనుబంధ సంఘాల ప్రతినిధులు, నగరంలోని వివిధ తర్పలకు చెందిన అధ్యక్ష, కార్యదర్శులు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సంఘం ప్రతినిధులు బీమర్తి రవి, గాలిపల్లి నారాయణ, పాము రమేశ్, గెంటెల వెంకటేశ్(బొట్టు), కోడూరు స్వామి, సిరిగాదే మనోహర్, ఆడెపు రాజన్న, రచ్చ మురళి, సామల శ్రీనివాస్, దిండిగల్ల శంకర్, భాస్కర్, జీజీ ప్రసాద్, పద్మసుభాష్, పెంబర్తి సంతోష్‌కుమార్, శేరుపల్లి బాగులరావు తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్ సేవలు చిరస్మరణీయం
● ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్
నిజామాబాద్ సిటీ: మాజీ సీఎం, దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డికి జిల్లాతో ఎంతో అనుబంధం ఉందని రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్‌బిన్ హందాన్ అన్నారు. జిల్లాకేంద్రంలోని కాంగ్రెస్ భవన్‌లో వైఎస్ జయంతిని మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తాహెర్‌బిన్ హందాన్ మాట్లాడుతూ వైఎస్‌కు జిల్లాతో అవినాభావ సంబంధం ఉందని, ఆయన జన్మదినం నిజాంసాగర్‌లో జరుపుకున్నామని గుర్తుచేశారు. గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా లక్షల ఎకరాలకు నీరు అందించిన ఘనత వైఎస్ రాజశేఖర్ రెడ్డికే దక్కుతుందన్నారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ, ఉచిత విద్యుత్ తదితర పథకాలు విజయవంతంగా అమలుచేసిన ధైర్యవంతుడైన నాయకుడన్నారు. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ ఆయన శిష్యుడేనన్నారు. వైఎస్ ఆశయాలను సీఎం రేవంత్ రెడ్డి ముందుకు తీసుకు వెళ్తున్నారన్నారు. కార్యక్రమంలో నుడా చైర్మన్ కేశ వేణు, పీసీసీ ప్రధాన కార్యదర్శి రాంభూపాల్, నాయకులు కెతావత్ యాదగిరి, వేణు, కోనేరు సాయికుమార్, ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు.

పద్మశాలి సంఘం జిల్లా అధ్యక్షుడిగా నారాయణ