
రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఇష్టారాజ్యం
సుభాష్‌నగర్: నగరంలోని నిజామాబాద్ అర్బన్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారుల ఇష్టారాజ్యంగా మారింది. పర్యవేక్షణ లేకపోవడంతో ఉద్యోగులు, సిబ్బంది సమయపాలన పాటించడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సోమ వారం రోజంతా సర్వర్ డౌన్ కావడంతో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్లు నిలిచిపోగా, మంగళవారం 12 గంటలు దాటినా అధికారులు విధులకు హాజరుకాలేదు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ కార్యాలయంలో 9 నెలలుగా రెగ్యులర్ సబ్ రిజిస్ట్రార్లు లేకపోవడంతో సీనియర్ అసిస్టెంట్లతో నెట్టుకొస్తున్నారు. ప్రస్తుతం ఒక్కరే ఇన్‌చార్జి సబ్ రిజిస్ట్రార్ ఉండగా, ఆయన కూడా మంగళవారం గైర్హాజరయ్యారు. సమాచార లోపంతో 12 దాటినా సబ్ రిజిస్ట్రార్‌గా విధులకు హాజరుకాలేదు. ఈ విషయాన్ని డాక్యుమెంట్ రైటర్లు, ప్రజలు ఉన్నతాధికారులకు తెలపడంతో వారి సూచనల మేరకు ఇద్దరు సీనియర్ అసిస్టెంట్లు ఇన్‌చార్జీలుగా కొనసాగారు. కాగా, మంగళవారం 44 డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలిసింది.
మధ్యాహ్నం 12 గంటలు దాటినా
విధులకు హాజరుకాని సబ్ రిజిస్ట్రార్లు
ఇబ్బందులు పడ్డ ప్రజలు