
పరిసరాల పరిశుభ్రతతోనే ఆరోగ్యం
మోపాల్(నిజామాబాద్‌రూరల్): గ్రామాల్లోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ప్రజలంతా ఆరోగ్యంగా ఉంటారని వైద్యులు బృందం సూచించింది. మండలంలోని నర్సింగ్‌పల్లిలో వైరల్ ఫీవర్లు పెరుగుతున్న నేపథ్యంలో వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమై నాలుగు బృందాలను పంపించింది. బృందాలు గ్రామం మొత్తం కలియ తిరిగి ప్రజలకు అప్రమత్తం చేస్తూ, అవగాహన కల్పించారు. ముఖ్యంగా వర్షపు నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ వేస్తూ, స్ప్రే చేశారు. డ్రై డే నిర్వహించారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వైద్యులు సూచించారు. ఇంటి పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. గ్రామపంచాయతీ సిబ్బందిసైతం ప్రతిరోజూ చెత్త సేకరించాలని, ఎప్పటికప్పుడు ఫాగింగ్ చేయాలన్నారు. లార్వా నిరోధక చర్యలు చేపట్టారు. అదేవిధంగా గ్రామంలో ఆరోగ్య శిబిరం నిర్వహించారు. జ్వరంతో బాధపడుతున్న వారికి మందులను అందజేశారు. మెరుగైన చికిత్సలు అవసరమున్న వారికి జీజీహెచ్‌కు సిఫారసు చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాములు నాయక్, వైద్యులు డాక్టర్ రాజు, డాక్టర్ నాగరాజు, డాక్టర్ వెంకటేష్, డాక్టర్ అజ్మల్, డాక్టర్ ప్రత్యూష, హెచ్‌ఈఓ గోవర్ధన్, పంచాయతీ కార్యదర్శి,జీపీ, వైద్యసిబ్బంది పాల్గొన్నారు.
నర్సింగ్‌పల్లిలో వైద్యుల బృందం పర్యటన