
నత్తనడకన అమృత్ 2.0
● యూజీడీ, తాగునీటి కోసం
రూ. 379 కోట్లు మంజూరు
● 18 వాటర్ ట్యాంక్‌ల్లో
నాలుగింటి పనులే ప్రారంభం
● నెమ్మదిగా సాగుతున్న
అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు
● పనుల పూర్తికి మరో ఏడాది
పట్టే అవకాశం
సా...గుతున్న యూజీడీ పనులు
అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ వ్యవస్థ ఇందూరువాసుల చిరకాల వాంఛ. ఈ కల కలగానే మిగిలిపోతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్ర భుత్వ హయాంలో మాజీ మంత్రి డీ శ్రీనివాస్ అంకురార్పణ చేసిన యూజీడీ పనులు 20 ఏళ్లు గడిచినా ముందుకు సాగడం లేదు. బీఆర్‌ఎస్ హయాంలో కొంతమేర పెద్ద డ్రెయినేజీ మా ర్గాలు తవ్వి, పైపులైన్లు వేసి వదిలేశారు. ప్రస్తు తం మళ్లీ కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అమృత్ 2.0 పథకం ద్వారా యూజీడీ పనులు కొనసాగిస్తున్నారు. కాలనీల్లోంచి పైపులైన్లు, వాటికి కనెక్షన్లు ఇవ్వడం వంటి పనులు సాగుతున్నాయి. నగరంలో 145 కిలోమీటర్ల మేర పైప్‌లైన్ పనులు జరగనున్నాయి. పనులు 2026 ఆగస్టు వరకు కొనసాగనున్నట్లు అధికారులు చెప్తున్నారు.
నిజామాబాద్ సిటీ: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న అమృత్ 2.0 (అటల్ మిషన్ ఫర్ రిజువెనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్‌ఫర్మేషన్) పథకం జిల్లాలో నత్తనడకన సాగుతోంది. పట్టణాల్లో ప్రజలు తాగునీరు, డ్రెయినేజీ వ్యవస్థను మెరుగుపర్చేందుకు కేంద్రం ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకానికి నిజామాబాద్ నగరాన్ని ఎంపిక చేసి రూ.379 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసింది. వీటిలో యూజీడీ(అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ)కి రూ. 162 కోట్లు, తాగునీటి వ్యవస్థకు రూ. 217 కోట్లు కేటాయించింది. అమృత్ 2.0 పనులు అప్పటి జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు చేతుల మీదుగా జనవరి నెలలో పైలాన్‌ను ఆవిష్కరించారు. కాంట్రాక్ట్ దక్కించుకున్న మెగా కంపెనీ పనులు ప్రారంభించారు. పబ్లిక్ హెల్త్ విభాగం పర్యవేక్షణలో పనులు కొనసాగుతున్నాయి. అమృత్ 2.0 పనులు పూర్తిచేసిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్‌కు అప్పగించనున్నట్లు అధికారులు తెలిపారు.
పిల్లర్ల దశలోనే..
నగరంలో తాగునీటి సరఫరా కోసం 5 లక్షల లీటర్ల కెపాసిటీతో 18 పెద్ద వాటర్ ట్యాంక్‌లు నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు వేశారు. కాలూరు, ఖానాపూర్, సారంగాపూర్, గూపన్‌పల్లి, ముబారక్‌నగర్, పాంగ్రా వంటి విలీన గ్రామాలతోపాటు నగరంలోని నాందేవ్‌వాడ, అర్సపల్లి, మాలపల్లి వంటి ప్రాంతాలను గుర్తించారు. ఇందులో 4 వాటర్ ట్యాంక్‌లు నిర్మించేందుకు స్థలాలను ఎంపిక చేశారు. నాలుగు నెలల క్రితం కాలూరు, ఖానాపూర్, నాందేవ్‌వాడలలో పనులు ప్రారంభించి, పునాదులు వేసి వదిలేశారు. గూపన్‌పల్లిలో ఎంపిక చేసిన స్థలాన్ని మార్చారు. మళ్లీ కొత్త ప్రదేశాన్ని ఎంపిక చేయలేదు. నాందేవ్‌వాడలోని పాత వాటర్ ట్యాంక్‌ను కూల్చి ఆ స్థలంలో కొత్త వాటర్ ట్యాంక్ నిర్మిస్తున్నారు. ఇది కూడా పిల్లర్ల దశలోనే ఉంది. మిగతా వాటి పనులు ఇంకా ప్రారంభించలేదు.
కార్పొరేషన్ కహానీ – 5

నత్తనడకన అమృత్ 2.0

నత్తనడకన అమృత్ 2.0