
రికార్డుల్లో ఎక్కువ.. తరగతుల్లో తక్కువ
నిజామాబాద్‌అర్బన్: ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతోంది. క్షేత్రస్థాయిలో తనిఖీలు లేకపోవడంతో విద్యాబోధన, ప్రభుత్వ నిబంధనలు సక్రమంగా జరగడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని మమ్మదేవినగర్ పాఠశాల నిర్వహణ చూస్తే మారుమూల ప్రాంతంలో ఉన్న పాఠశాలల నిర్వహణ ఎలా ఉంటుందో అర్థమవుతుంది. సదరు పాఠశాలలో విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండగా, టీచర్లు రికార్డుల్లో ఎక్కువగా చూపిస్తున్నారు.
81 మందికి 106 మంది..
మమ్మదేవినగర్ పాఠశాల ఒకటి నుంచి ఆరో తరగతి వరకు కొనసాగుతుండగా, ఐదుగురు టీచర్లు ఉన్నారు. ఇటీవల ‘సాక్షి’ పాఠశాలను సందర్శించగా.. ఒకటో తరగతిలో 9 మంది, రెండో తరగతిలో 11 మంది, మూడో తరగతిలో 14 మంది, నాల్గో తరగతిలో 18 మంది, ఐదో తరగతిలో 16 మంది, ఆరో తరగతిలో 13 మంది మొత్తం 81మంది విద్యనభ్యసిస్తున్నారు. కానీ పాఠశాల ఉపాధ్యాయులు మాత్రం రికార్డుల్లో 106 మంది విద్యార్థులు చదువుతున్నట్లు నమోదు చేస్తున్నారు. ఇక్కడ విద్యార్థుల సంఖ్యను ఎక్కువగా చూపడంతో టీచర్లు సర్దుబాటు నుంచి తప్పించుకొని ఇదే పాఠశాలలో కొనసాగాలనే ప్రయత్నం చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. మధ్యాహ్న భోజనం చేసే విద్యార్థుల సంఖ్య కూడా 100కు పైబడి నమోదు చేస్తున్నారు. కేవలం 20 నుంచి 30 మంది విద్యార్థులు మాత్రమే ప్రతిరోజు భోజనం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలోని బడిలోనే ఈ దుస్థితి ఉంటే జిల్లా సరిహద్దు ప్రాంతాలలోని బడుల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. విద్యాశాఖ అధికారులు తనిఖీలు చేపట్టకపోవడంతోనే ప్రభుత్వ బడుల్లో ఇలాంటి దుస్థితి నెలకొందని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు క్షేత్రస్థాయిలో పాఠశాలలను నిత్యం తనిఖీ చేస్తే ఇలాంటి అనేక లోటుపాట్లు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.
6వ తరగతిలో తక్కువగా ఉన్న విద్యార్థులు
నగరంలోని మమ్మదేవినగర్ ప్రభుత్వ బడిలో విద్యార్థుల సంఖ్యలో తేడాలు
పర్యవేక్షణ చేయని ఉన్నతాధికారులు
పరిశీలన చేస్తాం
మమ్మదేవినగర్ పాఠశాలను తనిఖీ చేస్తాం. విద్యార్థుల సంఖ్యను పరిశీలించి, తేడాలుంటే చర్యలు తీసుకుంటాం. అదనంగా ఉన్న టీచర్లను సైతం అవసరం ఉన్న పాఠశాలలకు పంపిస్తాం.
– సాయారెడ్డి, సౌత్ మండల ఎంఈవో, నిజామాబాద్

రికార్డుల్లో ఎక్కువ.. తరగతుల్లో తక్కువ

రికార్డుల్లో ఎక్కువ.. తరగతుల్లో తక్కువ