కలిసి పోరాడితే డ్రైపోర్టు సాధ్యం
తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్దాం
పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌తో కేంద్రమంత్రి అమిత్‌షాను కలుద్దాం
జిల్లాలో డ్రైపోర్టు ఏర్పాటైతే రూ.వెయ్యి కోట్ల ఎకానమీ
విలువ ఆధారిత పంట ఉత్పత్తులతో రైతులే ఎగుమతిదారులవుతారు
‘సాక్షి’ చర్చ వేదికలో వక్తల అభిప్రాయాలు
పాల్గొన్న చాంబర్ ఆఫ్ కామర్స్, రైతు ఉత్పత్తిదారుల సంస్థల బాధ్యులు
జేఏసీ ఏర్పాటుకు తీర్మానం
నిజామాబాద్‌లీగల్/డొంకేశ్వర్: జిల్లాలో డ్రైపోర్టు సాధించేందుకు తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో పో రాడుదామని చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధులు, రైతు ఉత్పత్తిదారుల సంఘాల బాధ్యులు, ఇతర సంఘాల ప్రతినిధులు నిర్ణయించారు. ఇందుకోసం ఐక్య కార్యాచరణ కమిటీ ఏర్పాటు చేసుకుని ముందుకు వెళ్లేందుకు తీర్మానం చేశారు. ఇందులో భాగంగా ఈ నెల 29న కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్‌షాను కలిసి విన్నవించేందుకు సిద్ధమయ్యారు. తర్వాత ఢిల్లీ వెళ్లి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చేందుకు ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయించారు. మంగళవారం ‘సాక్షి’ ఆధ్వర్యంలో ప్ర కాష్ హ్యుందయ్ షోరూంలో నిజామాబాద్ జిల్లాలో డ్రైపోర్టు ఏర్పాటు కోరుతూ చర్చ వేదిక జరిగింది.
నిజామాబాద్, జగిత్యాల, నిర్మల్, ఆదిలాబాద్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల్లో పండుతున్న పసుపు, ధాన్యం, సోయా, మొక్కజొన్న, ఎర్రజొన్న, పత్తి, మామిడి పంటలకు అదనపు విలువ జోడించడంతోపాటు సిరిసిల్ల జిల్లాల్లో నేతన్నల ఉత్పత్తులను అంతర్జాతీయ మార్కెట్‌కు నేరుగా ఎగుమతి చేసేందుకు డ్రైపోర్టుతో అవకాశం కలుగుతుంద ని, రూ.వెయ్యి కోట్ల ఎకానమీ సాధ్యమవుతుందని వక్తలు అభిప్రాయపడ్డారు. అన్నిరంగాల్లో వివిధ యూనిట్లు ఏర్పాటై యువతకు ఉద్యోగ, ఉపాధి అ వకాశాలు పెరుగుతాయన్నారు. డ్రైపోర్టు కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేందుకు కచ్చితమైన కార్యాచరణ రూపొందించుకుని ముందుకెళ్లాలని తీర్మానం చేశా రు. చర్చ వేదిక సమన్వయకర్త గా సాక్షి బ్యూరో ఇన్‌చార్జి తుమాటి భద్రారెడ్డి వ్యవహరించారు.
జిల్లాలో డ్రైపోర్లు, కంటెయినర్ డిపో ఏర్పాటు చేస్తే జిల్లాలో అభివృద్ధి వేగవంతమవుతుంది. దీనికోసం ఆరేళ్లుగా ఛాంబ ర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నాం. జిల్లాలో బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్‌ను చాంబర్ ఆఫ్ కామర్స్ పోరాటం చేసి సాధించింది. ప్ర స్తుతం బ్రాడ్‌గేజ్ రైల్వే లైన్ పోరాటాన్ని స్ఫూ ర్తిగా తీసుకుని ఉద్యమిద్దాం.
– జగదీశ్వర్‌రావు, అధ్యక్షులు, నిజామాబాద్ చాంబర్ ఆఫ్ కామర్స్
కేంద్రం అంగీరిస్తుందనే ఆశ ఉంది
డ్రైపోర్టు కోసం ఈ నెల 29న జిల్లాకు రానున్న కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కలిసి విన్నవిద్దాం. ఈలోపు సమ గ్రంగా ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయాలి. ఎంపీ అర్వింద్ సహాయాన్ని కోరుదాం. కేంద్ర ప్రభుత్వం పరిశ్రమల ఏర్పాటుపై సానుకూలంగా ఉన్న నేపథ్యంలో ఇందూరులో డ్రైపోర్టు ఏర్పాటుకు అంగీకరిస్తుందనే ఆశ ఉంది. చర్చవేదికను ఏర్పాటు చేసిన ‘సాక్షి’ యాజమాన్యానికి అభినందనలు.
– శ్రీనివాస్, చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యవర్గ సభ్యుడు
అన్ని పార్టీలు మద్దతు తెలపాలి
ఇందూరులో డ్రైపోర్ట్ ఏర్పాటు కోసం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చేస్తున్న పోరాటానికి రాజకీయాలు అతీతంగా మద్దతు తెలపాల్సి ఉంది. దీని సాధన కోసం తెలంగాణ ఉద్యమం స్ఫూర్తిగా ముందుకెళదాం. డ్రైపోర్ట్ ఏర్పాటైతే జిల్లా అభివృద్ధికి టర్నింగ్ పాయింట్ అవుతుంది.
– రాజశేఖర్‌రెడ్డి, రియల్ ఎస్టేట్ వ్యాపారి
సముద్రమార్గం అనుసంధానం
భూపరివేష్టిత రాష్ట్రంగా ఉన్న తెలంగాణలో సారవంతమైన భూములున్నాయి. జీఎస్‌డీపీని భారీగా అందించగలిగే సత్తా ఉన్న ఉత్తర తెలంగాణలోని ఇందూరు జిల్లాలో డ్రైపోర్టు ఏర్పాటు చేయాలి. ఈ జిల్లాకు రోడ్డు, రైలు మార్గం అనుసంధానంగా ఉన్నప్పటికీ సముద్రతీరం లేనందున డ్రైపోర్టు అత్యావశ్యకం. దీంతో నేరుగా సముద్రమార్గంతో సైతం అనుసంధానం అవుతుంది.
– కమల్ కిషోర్ ఇనాని, కార్యదర్శి, చాంబర్ ఆఫ్ కామర్స్
పార్టీలకతీతంగా పోరాడుదాం
డ్రైపోర్టుతో జిల్లాలో అన్నిరంగాలు అ భివృద్ధి చెందుతాయి. పార్టీలకతీతంగా డ్రైపోర్టు సాధనకు పోరాటం చే యాల్సిన సమయం వచ్చింది. జిల్లా కు రావాల్సిన డ్రైపోర్టును నల్లగొండకు తరలించుకుపోయారు. ఆదిలాబాద్, ని ర్మల్, జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు గేమ్ ఛేంజరైన డ్రైపోర్టును ఇందూరులో ఏర్పాటు చేసేందుకు బలమైన వాదనను కలసికట్టుగా వినిపిద్దాం. రైతులు, యు వత భాగస్వాములు కావాలి.
– శివాజీ లక్ష్మణ్ పాటిల్, వ్యాపారి


