నాణ్యమైన విద్య అందించేందుకు కృషి
బోధన్: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు కృషి చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ అన్నారు. పాఠశాలల్లో అన్ని రకాల మౌలిక సౌకర్యాలను ప్రభుత్వం కల్పి స్తోందని పేర్కొన్నారు. బడిఈడు పిల్లలను కచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు సూచించారు.
11 ఏళ్లుగా మూతపడి ఉన్న బోధన్ మండలంలోని భవానీపేట మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను గ్రామ యువత, ప్రజల సహకారంతో మండల విద్యాశాఖ అధికారులు తెరిపించారు. ఈ నేపథ్యంలో శుక్రవారం జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ పాఠశాలను సందర్శించి పరిశీలించారు. అనంతరం పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన విద్యార్థుల సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమంలో పాల్గొని చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. పాఠశాల ఆవరణలో తరగతి గదులు, మరుగుదొడ్డి నిర్మింపజేసిన రుద్ర షౌండేషన్ ప్రతినిధులను, పాఠశాల పునరుద్ధరణకు సహకరించిన గ్రామ యువకులను డీఈవో అభినందించారు. ఎంపీడీవో బాలగంగాధర్ తిలక్, టీచర్ కార్తీక్, సీఆర్‌పీ విజయ్ తదితరులు పాల్గొన్నారు.


