
ముందుకెళ్లాలా? వద్దా?
మొక్కజొన్నలో పంట మడిలో నిలిచిన నీరు
ఇందల్వాయి : ద్రోణి ప్రభావంతో ముందస్తుగా కు రుస్తున్న వర్షాలు రైతులను సందిగ్ధంలో పడేశాయి. ప్రతి సంవత్సరం జూన్ మొదటి వారం తర్వాత వర్షాలు కురిసేవి. కానీ, ఈసారి మే నెలలోనే వర్షాలు కురుస్తుండడంతో అన్నదాతల్లో అయోమ యం నెలకొంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు పంట దిగుబడులను విక్రయించేసుకున్న రైతులకు మే లు చేస్తుండగా, మిగతా వారికి నష్టాన్ని మిగులుస్తున్నాయి! ఇదిలా ఉండగా నైరుతి రుతుపవనాలు ఈ సారి ముందుగానే పలుకరించనున్నాయనే సమాచారంతో ఖరీఫ్ సాగుపై రైతుల్లో అయోమయం నెలకొంది.
ప్రయోజనాలు ఇవే..
ముందస్తు వానలతో రైతులకు ప్రయోజనాలూ ఉన్నాయి. ఇప్పటికే అలికిన పచ్చిరొట్ట ఎరువులైన జీలుగ, పెద్ద జనుము పంటలు ఏపుగా వేగంగా ఎదుగుతాయి. విత్తనం పసుపులో మొలక శాతం పెరిగే అవకాశం ఉంది. ఉద్యాన పంటలకు ఈ వర్షాలు మేలు చేస్తాయని సంబంధిత అధికారులు చెబుతున్నారు. సేంద్రియ ఎరువులు చల్లుకొని కలియదున్నడానికి ఈ వాతావరణం అనుకూలం.
లక్ష్యానికి మించి సాగయ్యే అవకాశం
వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో జిల్లాలో ఈసారి లక్ష్యానికి మించి పంటలు సాగయ్యే అవకాశం ఉంది. జిల్లా వ్యాప్తంగా వానాకాలంలో 5,21,309 ఎకరాల్లో పంటలు సాగయ్యే అవకాశం ఉన్నట్లు వ్యవసాయ శాఖ అంచనా వేసింది. అందులో 4.32 లక్షల ఎకరాల్లో వరి, 47 వేల ఎకరాల్లో మొక్కజొన్న, 37 వేల ఎకరాల్లో సోయాబీన్, మరో ఐదు వేల ఎకరాల్లో ఇతర పంటలు సాగవుతాయని అధికారులు తెలిపారు. పంటల సాగుకు అనుగుణంగా ఎరువులను అందుబాటులో ఉంచేందుకు వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తోంది.
నష్టాలు ఇవే..
మే నెలలో కురిసిన వర్షాలు చాలా మంది రైతులను నష్టాలపాలు చేశాయి. చెరువుల కింద సా గు చేసిన వరి కోతలు, మరికొన్ని చోట్ల ధాన్యం కొనుగోళ్లు పూర్తికాలేదు. లోతు దుక్కులు చేసే అవకాశం లేదు. దుక్కులు ఎండకపోవడంతో చీడపీడలు, శిలీంధ్రాలు భూమిలో అలాగే ఉండి వానాకాలం పంటలకు నష్టం కలిగించే అవకాశం ఉంది. మేలో చేతికొచ్చే నువ్వులు, సజ్జ పంటలు వర్షానికి తడిసి దిగుబడులు అమాంతం తగ్గిపోయాయి.
రంగు మారి ధరలు పడిపోయాయి. టమాటా, కొత్తిమీర, ఇతర కూరగాయ పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే సాగు చేసిన బుట్టమక్కతోపాటు అంకురం దశలో ఉన్న చిక్కుడు, మిరప, వంకాయ, బెండ వంటి కూరగాయల క్షేత్రాల్లో నీరు నిలిచి మొక్కలు చనిపోతున్నాయని, ఉన్న మొక్కల్లో ఎదుగుదలలేదని రైతులు వాపోతున్నారు.
ఈ స్థాయి వర్షాలు ఎన్నడూ చూడలేదు
గతంలో ఎన్నడూ మే నెలలో ఈస్థాయి వర్షాలు కురవడం చూడలేదు. చాలా మంది రైతులు వేసవి దుక్కులు కూడా చేసుకోలేదు. దున్నిన దుక్కులు కూడా పూర్తిస్థాయిలో ఎండలేదు. కూరగాయలు, నువ్వు పంటలతో తీవ్రంగా నష్టపోయాం. ముందస్తు వర్షాలతో పంటలు సాగు మొదలుపెట్టాలా? వద్దా? అనే అయోమయంలో ఉన్నాం. – దేంబాల్ గంగారెడ్డి, రైతు, నల్లవెల్లి
రైతులు తొందరపడొద్దు
పసుపు, మొక్కజొన్న పంటల సాగు ఇప్పుడు చేపట్టొచ్చు. జూన్ మూడు, నాలుగో వారాల్లో సోయాబీన్ విత్తుకోవడానికి అనుకూలం. వరిలో దీర్ఘకాలిక రకాలు, సన్నరకాలు సాగు చేసుకునే రైతులు జూన్ మొదటి వారంలో నారు పోసుకుంటే మంచిది. రైతులు తొందరపడకుండా పంటల సాగులో సందేహాలు, మెళకువలకు వ్యవసాయ అధికారులను సంప్రదించాలి.
– వీరాస్వామి, జిల్లా వ్యవసాయ అధికారి
ముందస్తు వానలతో అన్నదాతల్లో
అయోమయం
కోతలు పూర్తికాని పంటలపై ప్రభావం
జూన్ 1కి ముందే రుతు పవనాల రాక
పంటల సాగుపై నెలకొన్న సందిగ్ధత
వేచి చూడాలంటున్న వ్యవసాయ
అధికారులు

ముందుకెళ్లాలా? వద్దా?