
పూడిక తొలగింపుపై ఆశలు
బాల్కొండ: రాష్ట్రంలో పెద్ద ప్రాజెక్ట్‌లు అయిన శ్రీరాంసాగర్, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్‌ల్లో పూడిక తొలిగిస్తామని రాష్ట్ర భారీ నీటి పారుదల శాఖ మంత్రి రెండు రోజుల క్రితం దేవాదుల ప్రాజెక్ట్ సందర్శన సందర్భంగా ప్రకటించారు. దీంతో ఎస్సారెస్పీలో పూడిక తొలగింపుపై ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురించాయి. ఎస్సారెస్పీని నాలుగు నెలల క్రితం సందర్శించిన సమయంలో కూడా మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంతర్జాతీయ సాంకేతికతతో పూడిక తొలిగిస్తామని ప్రకటించారు. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో 11.2 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండగా, పూడిక తొలిగించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించి పూడిక తొలగిస్తే ప్రస్తుతంతో పోలిస్తే నీటి నిల్వ సామర్థ్యం అదనంగా 31.5 టీఎంసీల వరకు పెరిగే అవకాశం ఉంది. ఎగువ నుంచి ప్రతి ఏడాది వందల టీఎంసీల ఇన్‌ఫ్లో వస్తున్నా పూడిక కారణంగా నీటి నిల్వ సామర్థ్యం తగ్గడంతో దిగువకు విడుదల చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ సీజన్‌లోనే పూడిక తొలిగింపు చర్యలు చేపట్టాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు.
పూడిక ఇలా..
ఎస్సారెస్పీ నిర్మాణం పూర్తయిన 1978లో నీటి నిల్వ సామర్థ్యం 112 టీఎంసీలుగా నేషనల్ హైడ్రోగ్రాఫిక్ సర్వే నిర్ధారించింది. ఆ తరువాత 1994లో ఏపీఈఆర్‌ఎల్ (ఆంధ్ర ప్రదేశ్ ఇంజినీరింగ్ లేబరేటీస్ సంస్థ) 90 టీఎంసీలకు నీటి నిల్వ సామర్థ్యం పడిపోయినట్లు తెలిపింది. తరువాత 2014 – 15లో బెంగళూర్‌కు చెందిన సంస్థ సర్వే చేపట్టి నీటి నిల్వ సామర్థ్యం 70 టీఎంసీలకు పడిపోయినట్లు స్పష్టం చేసింది. కానీ ప్రాజెక్ట్ అధికారులు ఆ లెక్కను కొట్టి పారేశారు. 2023లో చేపట్టిన మరో సంస్థ సర్వే ప్రకారం నీటి నిల్వ సామర్థ్యం 80.5 టీఎంసీలకు పడిపోయినట్లు తేల్చారు. మంత్రి ప్రకటించిన విధంగా పూడిక తొలగిస్తే 31.5 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందని, వెంటనే ఆ దిశగా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు.
ఎస్సారెస్పీ, నాగార్జున సాగర్‌లో
పూడిక తొలిగిస్తామన్న మంత్రి ఉత్తమ్
పెరగనున్న నీటి నిలువ సామర్థ్యం