ఏదడిగినా కేసీఆర్‌ కాదనలేదు.. | - | Sakshi
Sakshi News home page

ఏదడిగినా కేసీఆర్‌ కాదనలేదు..

Apr 27 2025 12:38 AM | Updated on Apr 27 2025 12:38 AM

ఏదడిగ

ఏదడిగినా కేసీఆర్‌ కాదనలేదు..

నీటిపారుదల విషయంలో ప్రతి ప్రయోగం ఇక్కడి నుంచే మొదలు

మోతె గ్రామస్తుల ఉద్యమ స్ఫూర్తి అజరామరం

ఈ స్ఫూర్తితోనే రాష్ట్రంలోనే మొదటి జిల్లాప్రజా పరిషత్‌ గెలుపు..

మరింత స్పీడందుకున్న ఉద్యమం

స్వరాష్ట్రం సాకారమయ్యాక, సీఎం హోదాలో మోతెకు వచ్చి వరాలు కురిపించిన కేసీఆర్‌

రజతోత్సవ సభ నేపథ్యంలో వేముల ప్రశాంత్‌రెడ్డితో

‘సాక్షి’ ఇంటర్వ్యూ

సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: అభివృద్ధి పనుల విష యంలో ఏదడిగినా కేసీఆర్‌ కాదనలేదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తెలిపా రు. స్వరాష్ట ఉద్యమంలో తిరుగులేని స్ఫూర్తి రగిలించిన మోతె గ్రామం.. అభివృద్ధి విషయంలోనూ అంతే స్ఫూర్తి రగిలించిందన్నారు. బీఆర్‌ఎస్‌ రజతోత్సవం నేపథ్యంలో ‘సాక్షి’ ఇంటర్వ్యూలో ప్రశాంత్‌రెడ్డి పలు విషయాల ను గుర్తుచేసుకున్నారు. ఈ వివరాలు ఆయన మాటల్లోనే..

బీఆర్‌ఎస్‌కు అండగా గ్రామాలు

తీవ్రమైన కరువు సమస్యను ఎదుర్కొంటున్న వేల్పూర్‌ మండలంలోని మోతె గ్రామస్తులు తమ సమస్యలు పరిష్కారం కావాలంటే స్వరాష్ట్రం సాధించుకోవాల్సిందేనని నిశ్చయించుకున్నారు. 2001లో కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ ఏర్పాటు చేశాక ఏకగ్రీవ తీర్మానం చేసుకుని మోతె గ్రామస్తులు పార్టీ వైపు నిలబడ్డారు. ఇదే స్ఫూర్తితో మెండోరా మండలంలోని బుస్సాపూర్‌ గ్రామస్తులు తీర్మానం చేసుకుని బీఆర్‌ఎస్‌కు జైకొట్టారు. తరువాత రాష్ట్రవ్యాప్తంగా వరుసగా అనేక గ్రామాల్లో బీఆర్‌ఎస్‌కు మద్దతు పెరిగింది.

మోతె నుంచే జెడ్పీటీసీ అభ్యర్థి

పార్టీ ఆవిర్భవించిన కొన్ని నెలలకే ప్రజాపరిషత్‌ ఎన్నికలు వచ్చాయి. వేల్పూర్‌ మండలానికి సంబంధించి మోతె గ్రామస్తులు చెప్పిన వసంత్‌గౌడ్‌కే టిక్కెట్‌ ఇవ్వడం జరిగింది. మోతె స్ఫూర్తితో ఉమ్మడి జిల్లా ప్రజాపరిషత్‌ను బీఆర్‌ఎస్‌ సొంతంగా గెలుచుకుంది. ఈ గెలుపుతో ఉద్యమ పార్టీగా అనేక అడుగులు వేసింది. సబ్బండ వర్ణాలు ఉద్యమంలో కలిసివచ్చాయి. రాష్ట్రం కల సాకారమైంది.

మా తండ్రి ఆశయాలను కొనసాగిస్తున్నా..

స్వరాష్ట్రం వస్తేనే అనుకున్నవిధంగా అభివృద్ధి సాధ్యమని, గ్రామాలు స్వయం సమృద్ధి సాధించాలంటే చిన్ననీటి వనరులను పెపొందించుకోవాలని మా తండ్రి వేముల సురేందర్‌రెడ్డి చెప్పేవారు. ఆయన ఉద్యమ పార్టీ వ్యవస్థాపక సభ్యుడిగా, రాష్ట్ర రైతు విభాగం అధ్యక్షుడిగా చనిపోయేవరకు సేవలందించారు. ఆయన స్ఫూర్తిని కొనసాగిస్తున్నా.

నీటిపారుదల ప్రయోగాలు ఇక్కడి నుంచే మొదలు

నీటిపారుదల విషయంలో చెక్‌డ్యాముల నుంచి మొదలు అనేక చిన్న, పెద్ద తరహా నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించి ప్రతి ప్రయోగం ఇక్కడే చేశాం. ఇక్కడ సక్సెస్‌ చేశాక, కేసీఆర్‌ రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అమలు చేశారు. ఎస్సారెస్పీ వరద కాలువకు కింది లెవెల్‌లో 16 తూములు ఏర్పాటు చేయడంతో 45 చెరువు లు నిండుతున్నాయి. కాళేశ్వరం ద్వారా ప్రతి రెండున్నర ఎకరాలకు ఒక అవుట్‌లెట్‌ పాయింట్‌ ఏర్పాటు చేశాం.

మోతె మట్టితో ముడుపు కట్టిన కేసీఆర్‌

ఉద్యమ పార్టీ బీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చి స్ఫూర్తి రగిలించిన మోతె గ్రామానికి 2001 మే 5వ తేదీన కేసీఆర్‌ వచ్చి ఇక్కడి మట్టితో ముడుపు కట్టారు. 2014లో తెలంగాణ బిల్లు పార్లమెంట్‌లో పాసయ్యాక అదే ఏడాది మార్చి 28న కేసీఆర్‌ గ్రామానికి వచ్చి ముడుపు విప్పారు. తరువాత మళ్లీ ముఖ్యమంత్రి హోదాలో 2015 జూలై 6వ తేదీన ఇక్కడకు వచ్చి గ్రామంపై వరాలు కురిపించారు. గ్రామంలో చెరువు, మాటు కాలువ, పాఠశాల, ప్రత్యేకంగా పీహెచ్‌సీ, కొత్త గ్రామపంచాయతీ, రూ.2 కోట్లతో సీసీ రోడ్లు నిర్మాణమయ్యాయి. అప్పుడు వేల్పూర్‌లోని మా పెంకుటిల్లులోనే కేసీఆర్‌ బస చేశారు.

జగన్‌మోహన్‌రెడ్డికి పైలట్‌గా..

కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఏపీ ముఖ్యమంత్రి హోదాలో జగన్‌మోహన్‌రెడ్డి వచ్చినప్పుడు ఆయనను రిసీవ్‌ చేసుకుని పైలట్‌గా వ్యవహరించే బాధ్యతను కేసీఆర్‌ నాకు అప్పగించారు. దీన్ని ఎప్పటికీ మరిచిపోలేను.

ఏదడిగినా కేసీఆర్‌ కాదనలేదు.. 1
1/1

ఏదడిగినా కేసీఆర్‌ కాదనలేదు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement