సుభాష్‌నగర్: రాష్ట్రంలో హిందూ పుణ్యక్షేత్రాల యాత్ర పథకం తీసుకొచ్చి హజ్ యాత్ర తరహాలో ప్రతి నియోజకవర్గం నుంచి 500 మంది భక్తులకు చార్‌ధామ్ యాత్రకు ఆర్థికసాయం అందించాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్ పద్దులపై చర్చలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ మంగళవారం సుదీర్ఘంగా మాట్లాడారు. రాష్ట్రంలో తెలంగాణ టెంపుల్ డెవలప్‌మెంట్ అథారిటీని, తెలంగాణ టూరిజం అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేయాలన్నారు. ఇందూరు ఖిల్లా రామాలయాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్‌చేశారు. రాష్ట్రంలో నూతన సాంస్కృతిక పాలసీని తీసుకురావాలని, కళా ప్రదర్శనకు ప్రతి జిల్లాలో మినీ రవీంద్ర భారతిలను ఏర్పాటు చేయాలని కోరారు. విద్యాశాఖకు కనీసం 15శాతం నిధులు కేటాయించాలన్నారు. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ కాకుండా ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలన్నారు. మద్యం దుకాణాలకు దేవుళ్ల పేర్లు పెట్టకుండా చట్టం తీసుకురావాలని సూచించారు. నగరంలోని పాత కలెక్టరేట్, మైదానం కలుపుకుని మినీ స్టేడియం, పాత ఇరిగేషన్ భవనం స్థలంలో ఇండోర్ స్టేడియం నిర్మించాలన్నారు. రాజారామ్ స్టేడియంను పూర్తిస్థాయి క్రికెట్ స్టేడియంగా అభివృద్ధి చేయాలని కోరారు.
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే
ధన్‌పాల్ సూర్యనారాయణ