సుభాష్‌నగర్/డిచ్‌పల్లి: అసెంబ్లీ సమావేశాల్లో శనివారం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు పలు అంశాలపై మాట్లాడారు. వెయ్యేళ్ల చరిత్ర ఉన్న రఘునాథాలయం (ఖిల్లా) అభివృద్ధికి రూ.20కోట్లు కేటాయించాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ, బాసర సరస్వతి ఆ లయ టూరిజం సర్క్యూట్‌లో డిచ్‌పల్లి ఖిల్లా రామాలయాన్ని చేర్చాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ రేకులపల్లి భూపతిరెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. ఖిల్లా రామాలయంలో గతంలో అంగరంగ వైభవంగా ధూపదీప నైవేద్యాలు, పూజలు, సీతారాముల కల్యాణోత్సవాలు ఘనంగా జరిగేవని, నేడు శిథిలావస్థకు చేరిందని తెలపడం బాధగా ఉందని ధన్‌పాల్ అన్నారు. ఆలయ ప్రాంగణంలోని కోనేరు, శ్రీరామ కల్యాణవేదిక, దాశరథి మందిరం, గుడి గోపురం, పైకప్పు, గోడల మరమ్మతులు, మౌలిక సౌకర్యాల కల్పనకు కనీసం రూ.20కోట్లు స్పెషల్ ఫండ్ మంజూరు చేయాలని సీఎం రేవంత్‌రెడ్డిని కోరారు.
ఎకో టూరిజం అభివృద్ధి చేయాలి
శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ ప్రాంతంలో ఎకో టూరిజం డెవలప్ చేయొచ్చని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి తెలిపారు. అలాగే నిజాంసాగర్, రామడుగు ప్రాజెక్టుల్లో వాటర్ స్పోర్ట్స్ అడ్వెంచర్ టూరిజం ఏర్పాటు చేయొచ్చని పేర్కొన్నారు. జాతీయ రహదారికి దగ్గరగా ఉన్న డిచ్‌పల్లి ఖిల్లా రామాలయం, రామడుగు, ఎస్సారెస్పీ ప్రాజెక్టులను బాసర సర్క్యూట్‌లో కలిపి పర్యాటకంగా అభివృద్ధి చేస్తే ఉపాధి అవకాశాలు పెరుగుతాయన్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టిన నూతన బిల్లులో వీటిని చేర్చాలని విన్నవించారు.
రామాలయానికి రూ.20కోట్లు ఇవ్వండి