నిజామాబాద్ అర్బన్: కామారెడ్డి జిల్లా బాన్సువాడ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు నిజామాబాద్ జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. గుండె పోటుతో మృతి చెందిన కాంట్రాక్టర్ మృతదేహంతో ఆందోళన నిర్వహించారు. ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తీరుపై నిరసన వ్యక్తం చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి.
బాన్సువాడ నియోజకవర్గానికి ఇటీవల ఎన్‌ఆర్‌ఈజీఎస్ పనులు మంజూరయ్యాయి. వీటిని స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన వారికి ఇస్తున్నారని మొదటి నుంచి పార్టీలో ఉన్న వారికి ఇవ్వడం లేదని పలువురు కాంగ్రెస్ నాయకులు అసంతృప్తితో ఉన్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం బాన్సువాడ నియోజకవర్గంలోని 9 మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు సుమారు 400 మంది వివిధ వాహనాలలో నిజామాబాద్ కలెక్టరేట్‌కు తరలి వచ్చారు. కలెక్టరేట్ ప్రవేశం మార్గం వద్ద బైఠాయించారు. జిల్లా కలెక్టర్ బయటకు రావాలంటూ నినాదాలు చేశారు. ఎంపీడీవోలు నిబంధనలకు విరుద్ధంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చెప్పిన వారికే పనులు అప్పగిస్తున్నారని ఆరోపించారు. స్థానికంగా కలెక్టర్ లేకపోవడంతో అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ ప్రవేశ మార్గం వద్దకు వచ్చి కాంగ్రెస్ నాయకులతో మాట్లాడారు. నిబంధనల ప్రకారమే పనులు కేటాయించాలని ఆందోళనకారులు ఆయనకు వినతిపత్రం సమర్పించారు. అదే సమయంలో బీర్కూరు మండలం దామరంచకు చెందిన కాంట్రాక్టర్ ఇక్బాల్ గుండెపోటుతో ఆయన స్వగ్రామంలో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు కాంట్రాక్టర్ శవాన్ని కలెక్టరేట్‌కు తరలించి ఆందోళన చేశారు. ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పోలీసులు ఆందోళనకారులను కలెక్టరేట్‌లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి పెట్టిన ఇబ్బందుల వల్లనే కాంట్రాక్టర్ ఇక్బాల్ గుండెపోటుతో మరణించారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. గతంలో ఇక్బాల్, ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి బిల్లులు రాకుండా అడ్డుకుంటున్నారని, వేధింపులకు గురి చేస్తున్నాడని సామాజిక మాద్యమంలో పోస్టులు కూడా పెట్టినట్లు ఆందోళన కారులు పేర్కొన్నారు. మృత దేహంతో అరగంట పాటు నిరసన వ్యక్తం చేసి వెళ్లిపోయారు. ఆందోళనలో ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు ఎలమంచిలి శ్రీనివాసరావు, బాన్సువాడ మార్కెట్ కమిటీ మాజీ అధ్యక్షుడు పాత బాలకృష్ణ, గణేశ్ నందుపటేల్, కమలాకర్‌రెడ్డి వివిధ మండలాలకు చెందిన కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డికి
వ్యతిరేకంగా బాన్సువాడ కాంగ్రెస్ నాయకుల ఆందోళన
గుండెపోటుతో మరణించిన
కాంట్రాక్టర్ శవంతో నిరసన
కలెక్టరేట్ ముట్టడి