నాటి అల్లకొండ..
మిగిలింది పక్షం రోజులే..
● అల్లయ్య, కొండయ్య
అనే మల్లయోధులు నిర్మించిన పట్టణం
● 1059లో మూడంచెల వ్యవస్థతో ఖిల్లా నిర్మాణం
● 1102లో ఢిల్లీ సుల్తానుల ఆక్రమణతో ధ్వంసం.. తరువాత పునర్నిర్మాణం చేసిన కాకతీయులు
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : జిల్లాలో నియోజకవర్గ కేంద్రంగా ఉన్న బాల్కొండ పట్టణానికి ప్రపంచానికి చాటి చెప్పేలా గొప్ప ప్రాచీన చరిత్ర ఉంది. బాల్కొండకు చెందిన అల్లయ్య, కొండయ్య అనే మల్లయోధులు 1059లో ఇక్కడ కొండపై భారీ ఖిల్లాను నిర్మించారు. రాష్ట్ర పురావస్తు శాఖ వివరాల మేరకు ఖిల్లా లోపలి భాగంలో 39 ఎకరాల 27 గుంటల విస్తీర్ణం ఉంది. అప్పట్లో దీనిని అల్లకొండ కోట అనేవారు. ఈ కోట కొండలతో చుట్టుముట్టినట్లుగా ఉండేది. అప్పట్లో ఈ అల్లకొండ నగరాన్ని శ్రీ సోమ, ఆర్య, సూర్య క్షత్రియులు పరిపాలించారు. మూడు అంచెల వ్యవస్థతో అల్లకొండ రాజ్యాన్ని కాపాడారు. ఖిల్లా గుట్ట కింద లోపలి భాగంలో అంతర్గత రాజమహల్ నిర్మించారు. ఇక్కడ ఉన్న బావికి అత్తాకోడళ్ల బావి అని పేరు. ఈ బావిలో ఒక వైపు మంచినీరు, మరోవైపు ఉప్పు నీరు ఉండటం విశేషం. ఆ రోజుల్లో ఒకే బావిలో ఇలా రెండు రకాల నీరు లభించినట్లు విశేషంగా చెప్పుకునేవారు. శత్రువుల చొరబాటు నిరోధించేందుకు గాను కోటకు ఆరు సింహ ద్వారాలు(కమాన్లు), దీన్ని ఆనుకుని పట్టణం, చుట్టూ లోతైన ‘కందకాలు‘ నిర్మించారు. వీటికి అనుసంధానంగా ఆయా సింహద్వారాల అడుగు భాగంలో నాగపడగ ఆకారంలో ఇప్పటికీ గుర్తులు ఉన్నాయి.
● ఘనచరిత్ర కలిగిన అల్లకొండ ఖిల్లాపై 1101 లో ఢిల్లీ సుల్తాన్ అయిన అలంగీర్‌పాషా సోదరుడైన జాఫర్ ముఖురబ్ ఖాన్ 5 వేల మంది సిపాయిలతో దండెత్తి ఓటమి చెందాడు. ఓటమి సహించలేక మళ్లీ రెండోసారి 1102లో 5 వేల అశ్వక దళాలు, వెయ్యి ఏనుగులు, 7 వేల మంది సిపాయిలతో దండెత్తి అల్లయ్య, కొండయ్యలను హతమార్చి కోటను ఆక్రమించుకున్నారు. దీంతో ఖిల్లా ఢిల్లీ పాలకుల చేతిలోకి వెళ్లింది.
● ఢిల్లీ పాలకుల అనంతరం అల్లకొండ కోట కాకతీయుల పాలనలోకి వెళ్లింది. గణపతిదేవుడు ఈ ఖిల్లాను తిరిగి నిర్మించినట్లు చరిత్రకారుడు బీఆర్ నర్సింగ్‌రావు తెలిపారు. ఇప్పటికీ ఈ ఖిల్లా నిర్మాణాలపై కాకతీయ పాలకుడైన గణపతిదేవుడు వేసిన శాసనాలు ఉన్నాయి. ఇలాంటి పురాతన కట్టడాల వారసత్వ సంపద కనుమరుగు కాకుండా కాపాడుకోవాలని నర్సింగ్‌రావు కోరుతున్నారు. నర్సింగ్‌రావు 2014 నుంచి 2020 వరకు ఈ ఖిల్లా గురించి రీసెర్చ్ చేశారు.
నేటి బాల్కొండ
నేటి బాల్కొండ
నేటి బాల్కొండ
నేటి బాల్కొండ
నేటి బాల్కొండ
నేటి బాల్కొండ