మోపాల్: మండలంలోని ఎల్లమ్మకుంట శివారులో ట్రాన్స్‌ఫార్మర్ లోపల తీగ తెగిపోవడంతో శుక్రవారం సాయంత్రం రైతులే మరమ్మతులు చేపట్టిన ఘటనపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. విద్యుత్‌శాఖ అధికారులు మరమ్మతులు చేసేందుకు రావడం ఆలస్యమవుతుందని, పంటలకు సాగునీరు త్వరగా అందాలనే ఉద్దేశంతో తామే మరమ్మతులు చేపట్టామని రైతులు పేర్కొన్నారు. మరమ్మతులు చేసే సమయంలో విద్యుత్ సరఫరా అయి, ఏదైనా ఘటన జరిగితే బాధ్యులెవరని చర్చ జరుగుతోంది. ట్రాన్స్‌ఫార్మర్ తీగ తెగిపోవడంతో రైతులు లైన్‌మన్ మురళీని సంప్రదించారు. గతంలో ఇక్కడ పనిచేసిన జూనియర్ లైన్‌మన్ మహేశ్ బదిలీ కావడంతో మురళికి అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన వస్తున్నానని సమాధానమిచ్చినా.. ఆలస్యమవుతోందని భావించిన రైతులు ట్రాన్స్‌ఫార్మర్‌కు మరమ్మతులు చేపట్టారు. లైన్‌మన్ అక్కడికి వెళ్లేలోపే మరమ్మతులు పూర్తిచేశారు. కాగా ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతులకు రైతులు సబ్‌స్టేషన్‌లో అనుమతి తీసుకుని విద్యుత్ సరఫరా నిలిపివేశారని కొందరు.. ట్రాన్స్‌ఫార్మర్ బంద్ చేశారని మరికొందరు పేర్కొంటున్నారు. ఇదే విషయమై మోపాల్ ఏఈ నాగశర్వాణి ని వివరణ కోరగా, రైతులు మరమ్మతులు చేసిన విషయం తనకు తెలియదని, సోషల్ మీడియా ద్వారా తెలిసిందన్నారు. ఇకముందు రైతులకు ఏమైనా విద్యుత్ సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలే తప్ప అలా చేయొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు.
పంటలకు సాగునీరు అందడం లేదని..
విద్యుత్‌శాఖ అధికారులు
పట్టించుకోక పోవడంతో..