నిజామాబాద్‌అర్బన్: ప్రొఫెసర్ రాంరెడ్డి దూరవిద్య కేంద్రంలో ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రాంమోహన్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. డిగ్రీ, పిజీ, డిప్లోమా కోర్సులలో ప్రవేశాలకు రెండో విడత ఆవకాశం కల్పించినట్లు తెలిపారు. ఆసక్తిగలవారు ఈనెల 31లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 99126 70252 సంప్రదించాలన్నారు.
ఉచిత డ్రైవింగ్ కోర్సుకు..
నిజామాబాద్‌అర్బన్: వెనుకబడిన తరగతుల సహకార ఆర్థిక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే ఉచిత డ్రైవింగ్ కోర్సులలో శిక్షణ పొందేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అధికారి స్రవంతి ఒక ప్రకటనలో తెలిపారు. డ్రైవింగ్‌లో హెచ్‌ఎంవీ, ఎల్‌ఎంవీ శిక్షణ కాలం 30రోజులు ఉంటుందన్నారు. ఈ శిక్షణ పూర్తయిన తర్వాత రవాణా సంస్థ అర్హత కలిగిన అభ్యర్థులకు పర్మినెంట్ లైసెన్స్ ఉచితంగా అందిస్తుందన్నారు. అభ్యర్థులకు ఉచిత శిక్షణ, భోజనం, వసతి హైదరాబాదులో కల్పించనున్నట్లు తెలిపారు. 18ఏళ్ల నుంచి 45ఏళ్లలోపు వారు అర్హులన్నారు. 8వ తర గతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. ఆసక్తి గల బీసీ నిరుద్యోగ యువతీయువకులు దరఖాస్తులను ఈనెల 15నుంచి 31లోపు జిల్లా బీసీ వెనుకబడిన తరగతుల కార్యాలయంలో అందించాల.
కేసుల చార్జిషీట్‌పై సమీక్ష
ఖలీల్‌వాడి: నగరంలో శనివారం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లక్ష్మీనర్సయ్య ఆధ్వర్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కోర్టుల్లో విధులు నిర్వహిస్తున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో కేసుల చార్జిషీట్‌పై సమీక్ష నిర్వహించారు. కొత్త చట్టాల ద్వారా లోక్ అదాలత్ కేసుల లొసుగుల గురించి సమీక్షించారు. లక్ష్మీనర్సయ్య మాట్లాడుతూ.. నూతన చట్టాల ద్వారా నేరపరిశోధన, చార్జిషీట్ దాఖలు చేసే విధానం గురించి, సాక్షుల వివరాలు సేకరించే విధానం గురించి వివరించారు. ప్రతి కేసులో ముద్దయిలకు శిక్ష పడే విధంగా చూడాలని కోరారు. జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్లు పీసు రాజేశ్వర్‌రెడ్డి, రాజగోపాల్‌గౌడ్, దామోధర్ రెడ్డి, కావేటి శేషు, బంటు వసంత్, అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్లు జి. రామకృష్ణ, భూసారపు రాజేష్ గౌడ్, అశోక్ శివరాంనాయక్, చిదిరాల రాణి పాల్గొన్నారు.
ఏప్రిల్ 20 నుంచి ‘ఓపెన్’ పరీక్షలు
నిజామాబాద్‌అర్బన్: జిల్లాలో ఏప్రిల్ 20 నుంచి 26 వరకు ఓపెన్ ఎస్సెస్సీ, ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం పరీక్షలు 9గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం పరీక్షలు మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగుతాయన్నారు. ఇంటర్ ప్రాక్టికల్స్ ఏప్రిల్ 26నుంచి మే 3వరకు కొనసాగుతాయన్నారు.