నిజామాబాద్‌అర్బన్: ప్రస్తుతం విద్యాసంస్థల్లో వార్షిక పరీక్షలు జరుగనున్నాయి. త్వరలో పదోతరగతి పరీక్షలు సైతం ప్రారంభం కానున్నాయి. ఈక్రమంలో విద్యార్థులు పరీక్షల్లో ఒత్తిడికి గురికాకుండా, భయం లేకుండా పరీక్షలు రాయాలని మానసిక వైద్యుడు, ఇండియన్ సైకియాట్రిక్ సొసైటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విశాల్ పేర్కొంటున్నారు. చాలా మంది విద్యార్థులు పరీక్షలు రాగానే భయపడుతుంటారు. కానీ కొన్ని జాగ్రత్తలు తీసుకున్నట్లయితే సులువుగా పరీక్షల్లో విజయం సాధించవచ్చు. అలాగే విద్యార్థులకు ఒక ప్రకటనలో పలు సలహాలు, సూచనలు చేశారు.
● పరీక్షలకు వెళ్లేముందు పరీక్ష విధానం గురించి స్పష్టంగా తెలుసుకోవాలి. టీచర్స్ చెప్పిన మెళకువలు గుర్తుచేసుకోవాలి.
● ప్రశ్నలు ఏ విధంగా అడుగుతున్నారు. వాటికి జవాబులు ఎలా రాయాలి, ఎంత రాయాలి, ఎంత సమయం కేటాయించాలో తెలుసుకోవాలి.
● జ్ఞాపకశక్తి అందరికి ఒకేవిధంగా ఉంటుంది. మనం ఎంత శ్రమిస్తే మన జ్ఞాపకశక్తి అంత మెరుగుపడుతుందని గ్రహించాలి.
● నేను పరీక్షలు సరిగ్గా రాయగలను అన్న ఆత్మవిశ్వాసంతో పరీక్షకేంద్రంలోకి వెళ్లాలి.
● అర్థంగాని విషయాలను (సబ్జెక్టు)ను టీచర్స్‌లేదా మీ తోటి విద్యార్థులను అడిగి తెలుసుకోవాలి.
● బద్దకం, సోమరితనం, అతినిద్ర మన దగ్గరకు రాకుండా ఉండాలంటే ఉదయం ఒక అరగంట యోగా, వ్యాయమం చేయడం మంచిది.
● ఎట్టిపరిస్థితిలోనూ ముఖ్యమైన పనులను, చదువును వాయిదా వేయకూడదు.
● భోజనం చేసిన తర్వాత నిద్ర రావడం సహజం. చదువుకునే సమయంలో నిద్రవస్తే మీ తోటి స్నేహితులతో గ్రూప్ ్‌డిస్‌కర్సన్ చేయాలి.
● చదువుతున్నపుడు ప్రతి గంటకు ఒక పది నిమిషాలు విరామం తీసుకోండి. దీనివలన చదివిన విషయాలు ఎక్కువ రోజులు జ్ఞాపకం ఉంటాయి.
● సబ్జెక్టు అర్థంకాకపోతే వదిలి వేయకుండా సబ్జెక్టు టీచర్‌ను అడిగి నేర్చుకోవాలి. అవసరమయితే ఆ సబ్జెక్టులో అవగాహన ఉన్న మీ తోటి స్నేహితులతో అడిగి తెలుసుకోవాలి.
● పరీక్షలలో జవాబులు సొంతంగా రాయడానికి ప్రయత్నించండి. జవాబుల్లో మీదంటూ ఒక ప్రత్యేకత ఉండాలి. అందరు రాసే గైడ్లోని, మాడల్‌పేపర్‌లోని జవాబులను చూసి బట్టి పట్టకూడదు.
● జవాబులు పాయింట్లు లాగా సక్రమంగా, సంపూర్ణంగా, అర్థవంతంగా ఉండాలి. వీలైతె ప్రతి జవాబుకు డయాగ్రామ్ వేయండి. రాసిన రాతలో పటుత్వం ఉండాలి. అనవసరమైన వ్యాఖ్యలు, పిచ్చిరాతలు లేకుండా, జవాబు స్పష్టంగా రాయాలి.
● చేతిరాతను అందంగా మెరుగు పరుచుకోవాలి. అంతే కాకుండా అవసరమయినంత వేగంగా రాయడానికి ప్రయత్నించాలి.
● పరీక్షలో కష్టమయిన ప్రశ్నలను కూడా వదలకుండా మీకు వచ్చినంత వరకు రాయడానికి ప్రయత్నించాలి, అంతేగాని ప్రయత్నాన్ని విరమించకూడదు.
భయం వీడి, బాగా రాసి,
మంచి మార్కులు సాధించాలి
విద్యార్థులకు మానసిక వైద్యుడు విశాల్ సూచనలు