
రోడ్డు నిర్మాణంపై ఇరువర్గాల మధ్య ఘర్షణ
పెద్దకొడప్‌గల్(జుక్కల్): నూతన సీసీ రోడ్డు నిర్మాణ విషయంలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరుగగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని జగన్నాథ్‌పల్లి తండాలో గురువారం చోటుచేసుకుంది. తండావాసులు తెలిపిన వివరాలు ఇలా.. మండలంలోని జగన్నాథ్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఇటీవల ఎన్‌ఆర్‌ఈజీఎస్ నిధులతో నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ఈక్రమంలో రోడ్డు నిర్మాణ ప్రాంతంలో ఈ స్థలం తమది అంటే తమదని ఇరువర్గాల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. రెండు వర్గాలవారు రెచ్చిపోయి ఇటుకలతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ మహిళతోపాటు ముగ్గురు గాయపడ్డారు. స్థానికులు వెంటనే వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్సై మహేందర్ ఘటన స్థలానికి చేరుకొని విచారణ చేట్టారు. గాయపడ్డ హుషార్ సింగ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.