నవీపేట: నవీపేట మండలం అల్జాపూర్, అబ్బాపూర్(బి) గ్రామాల్లో చిరుత పులుల సంచారం చుట్టు పక్కల గ్రామాల ప్రజలను కలవరపెడుతోంది. మండలంలోని వివిధ గ్రామాలు గుట్టలకు ఆనుకుని ఉండడంతో అటవీ జంతువులు జనవాసాల మధ్య సంచరిస్తున్నాయి. రెండు రోజుల క్రితం అల్జాపూర్–యంచ గ్రామాల మధ్య చెరువుకు తాగునీటి కోసం రెండు చిరుతలు రాగా శివారులో ఉన్న రైతులు భయాందోళనకు గురయ్యారు. గతంలో ఇదే ప్రాంతంలో చిరుత దాడిలో మేకలు మృత్యువాత పడ్డాయి. మళ్లీ కనిపించడంతో అప్రమత్తమైన ఫారెస్ట్ అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. నందిగామ–అల్జాపూర్–యంచ గ్రామాల ను ఆనుకుని ఉన్న గుట్టల్లో రోడ్లు దాటుతూ రెండు చిరుతలు సంచరిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అబ్బాపూర్ గుట్టల్లో నాలుగు చిరుతలు
నెల రోజుల క్రితం మండలంలోని అబ్బాపూర్ (ఎం) శివారులోని గుట్ట అంచున ఉన్న పశువుల పాకపై చిరుత దాడి చేసి రెండు ఆవులను చంపేసింది. ఎడపల్లి, రెంజల్, నవీపేట మండలాల పరిధిలోని పలు గ్రామాలను ఆనుకుని దట్టంగా ఉన్న అడవిలో చిరుతలు, దుప్పిలు, అడవి పందులు, ఇతర జంతువులు ఉన్నట్లు గతంలో అధికారులు గుర్తించారు. మరో నాలుగు చిరుతలు ఈ దట్టమైన ప్రాంతంలో ఉన్నాయని తెలిపారు. మోకన్‌పల్లి శివారులోని చిన్నపాటి గుట్ట సమీపంలోని ఉన్న ఇటుక బట్టీ దగ్గర ఏడాది క్రితం కనిపించిన తల్లీ, పిల్ల చిరుతలను చుట్టు పక్కల గ్రామాల వాసులను భయబ్రాంతులకు గురి చేశాయి.
అధికారులు బంధించాలంటున్న అబ్బాపూర్, అల్జాపూర్ గ్రామస్తులు
సంచార ప్రదేశాలను
పరిశీలించిన అటవీశాఖ అధికారులు
దాడి తీవ్రమైతే బంధిస్తాం
మండలంలోని అబ్బాపూర్(ఎం), అల్జాపూర్ గ్రామాల అటవీ ప్రాంతంలో చిరుతలు సంచరిస్తున్నాయి. దట్టమైన అబ్బాపూర్ అటవీ ప్రాంతంలో నాలుగు చిరుతలు, అల్జాపూర్ శివారులో జంట చిరుతలు ఉన్నాయి. ఈ ప్రాంతాల్లోని చిరుతలు ఇంత వరకు మనుషులపై దాడి చేయలేదు. చిరుతల దాడి తీవ్రమైతే బంధిస్తాం.
– జెహ్రూ, సెక్షన్ ఆఫీసర్
(నిజామాబాద్ రేంజ్)