రాయితీ విత్తనాలు లేనట్లేనా?

- - Sakshi

మోర్తాడ్‌ : రానున్న వర్షాకాలం సీజనుకు గాను మొక్కజొన్న, సోయా విత్తనాలను రాయితీపై అందించే అవకాశం కనిపించడం లేదు. గతంలో ప్రతి వర్షాకాలం సీజనులో రెండు, మూడు రకాల విత్తనాలను రాయితీపై సహకార సంఘాల ద్వారా విక్రయించేవారు. విత్తనాలకు సబ్సిడీని అందించి రైతులపై భారం తగ్గించడానికి ప్రభుత్వం విముఖత చూపడంతో రైతులు వ్యాపారుల వద్దనే విత్తనాలను ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. కేవలం జీలుగ విత్తనాలను మాత్రమే రాయితీపై వ్యవసాయ శాఖ అందిస్తోంది. సోయా, మొక్కజొన్న విత్తనాల సంచులను 15 శాతం నుంచి 25 శాతం రాయితీపై రైతులకు విక్రయించేవారు. సహకార సంఘాలకు విత్తనాల నిలువలను పంపించి రైతుల వివరాలను నమోదు చేసుకుని రాయితీ విత్తనాలను విక్రయించడం ఎంతో కాలం కొనసాగింది. ప్రభుత్వం 2018 నుంచి రైతుబంధు అందిస్తుండటంతో రాయితీ పథకాలను అన్నింటిని నిలపివేసిందనే అభిప్రాయం వ్యక్తమైతుంది. వ్యాపారుల వద్దనే విత్తనాలను కొనుగోలు చేయాల్సి రావడంతో వారు చెప్పిన ధరకే విత్తనాలను రైతులు కొనుగోలు చేయాల్సి వస్తుంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి రాయితీపై విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలని పలువురు కోరుతున్నారు.

జీలుగ విత్తనాలే ఉన్నాయి

రైతాంగానికి రానున్న వానాకాలం సీజన్‌కు రాయితీపై జీలుగ విత్తనాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. జీలుగ విత్తనాలను భూసారం కోసం వినియోగిస్తారు. మొక్కజొన్న, సోయా విత్తనాల సరఫరాపై మాకు ఎలాంటి సమాచారం లేదు.

– అబ్దుల్‌ మాలిక్‌, వ్యవసాయాధికారి, ఏర్గట్ల

మక్క, సోయా విత్తనాలను వ్యాపారుల వద్దే కొనుగోలు చేస్తున్న రైతులు

జీలుగ విత్తనాలను మాత్రమే సబ్సిడీపై అందిస్తున్న వ్యవసాయ శాఖ

Read latest Nizamabad News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top