నిరంతరాయంగా.. నాణ్యమైన విద్యుత్‌ | - | Sakshi
Sakshi News home page

నిరంతరాయంగా.. నాణ్యమైన విద్యుత్‌

Jun 16 2026 11:52 PM | Updated on Jun 16 2026 11:52 PM

● భవిష్యత్‌ అవసరాలకు అనుగుణంగా హెచ్‌టీ, ఎల్‌టీ లైన్ల విస్తరణ ● టీజీఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌రెడ్డి

నిర్మల్‌చైన్‌గేట్‌/భైంసాటౌన్‌/కడెం/ఖానాపూర్‌: వినియోగదారులకు నిరంతరాయంగా, నాణ్యమైన విద్యుత్‌ సరఫరా అందించాలని, భవిష్యత్తు విద్యుత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకుని అవసరమైన హెచ్‌టీ, ఎల్‌టీ లైన్‌ విస్తరణ, అభివృద్ధి పనులు చేపట్టాలని టీజీఎన్‌పీడీసీఎల్‌ సీఎండీ వరుణ్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం భైంసా, కడెం విద్యుత్‌ సబ్‌స్టేషన్లను సందర్శించారు. నిర్మల్‌, ఖానాపూర్‌లోని విద్యుత్‌ శాఖ కార్యాలయాల్లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సరఫరా మెరుగుదలకు సంబంధిత అధికారులకు కీలక సూచనలు చేశారు. 11 కేవీ, 33 కేవీ ఫీడర్లలో ట్రిప్పింగ్‌లు తగ్గించేందుకు ప్రస్తుత విద్యుత్‌ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలన్నారు. అవసరమైన చోట స్తంభాలు ఏర్పాటు చేయడంతోపాటు లైన్లలోని లోపాలు సరిదిద్దాలని సూచించారు. డిస్టిబ్య్రూషన్‌ ట్రాన్స్‌ఫార్మర్ల(డీటీఆర్‌) వైఫల్యాలను తగ్గించేందుకు అవసరమైన చోట స్తంభాలు ఏర్పాటు చేయడం, అధిక లోడ్‌ ఉన్న ప్రాంతాల్లో స్పేసర్లు అమర్చడం, ఓవర్‌లోడ్‌ అయిన డీటీఆర్‌లను మార్చడం, ప్రమాదకర ప్రాంతాల్లోని 11 కేవీ ఫీడర్లపై లైట్నింగ్‌ అరెస్టర్లను ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను గుర్తించి, తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కడెం, పెంబి, దస్తురాబాద్‌ మండలాల్లో అటవీ ప్రాంతాల్లో ఈదులుగాలులకు విద్యుత్‌ అంతరాయాలు ఏర్పడుతున్నాయని, సమస్య పరిష్కరించేందుకు ఆటవీ ప్రాంతా గుండా కవర్డ్‌ కండక్టర్‌ విద్యుత్‌ లైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. గంగాపూర్‌లో సబ్‌స్టేషన్‌ పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఖానాపూర్‌ 133 కేవీ అంతరాయం కల్గినపుడు, కడెం, దస్తురాబాద్‌ మండలాలకు తాళ్లపేట్‌ వద్ద ఏర్పాటు చేస్తున్న నూతన 133 కేవీ సబ్‌స్టేషన్‌ నుంచి ప్రత్యామ్నాయంగా సరాఫరాకు చేయవచ్చని తెలిపారు. సత్తన్‌పల్లి, బీర్నంది మధ్యలో 33 కేవీ లైన్‌ ఏర్పాటు, కడెం నుంచి దస్తురాబాద్‌ వైపు డబుల్‌ సర్య్కూట్‌ లైన్‌ నిర్మాణం పనులు చేపడుతున్నామని వెల్లడించారు. ఎక్కడైనా డీటీఆర్‌లు దెబ్బతింటే ఒకే రోజులో వాటిని మార్చేలా నిల్వలు సిద్దంగా ఉంచాలని అధికారులకు సూచించారు. విద్యుత్‌ సిబ్బంది భద్రతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలని తెలిపారు. విద్యుత్‌ కనెక్షన్లు నిబంధనల ప్రకారం రెండు నెలల్లో ఇవ్వాలన్నారు. కుభీర్‌ సబ్‌ స్టేషన్‌ పరిధిలో తరచూ విద్యుత్‌ సమస్యలు ఎదురవుతుండడంతో తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమాల్లో ఎస్‌ఈ జాదవ్‌ సుభాష్‌, భైంసా డీఈఈ తిలక్‌, ఎస్‌ఈ రాథోడ్‌ సుభాష్‌, డీఈఈలు భాస్కర్‌, నాగరాజు, ఏడీఈ శ్రీనివాస్‌, ఏఈఈ రాంసింగ్‌, సబ్‌ ఇంజనీర్‌ స్వాతి, డీఈ ఎంఆర్‌టీ తిలక్‌, ఏడీ శ్రీనివాస్‌, కడెం సర్పంచ్‌ దీకొండ విజయ్‌కుమార్‌, నిర్మల్‌ టౌన్‌, నిర్మల్‌ రూరల్‌ ఉప విభాగాల ఆపరేషన్‌ అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజినీర్లు, అసిస్టెంట్‌ ఇంజినీర్లు పాల్గొన్నారు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement