తానూరు: తానూర్–బెల్‌తరోడా రహదారిపై శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనాన్ని ఆపి పోలీసు పేరిట దారి దోపిడీ చేసిన వ్యక్తిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. మరొకరి కోసం గాలిస్తున్నారు. ఎస్సై షేక్ జుబేర్ తెలిపిన వివరాల ప్రకారం.. భైంసా పట్టణానికి చెందిన గంగాధర్ కోలూర్ గ్రామంలోని తన కూతురు వద్దకు శుక్రవారం రాత్రి ద్విచక్ర వాహనంపై వెళ్తున్నాడు. భైంసా నుంచి మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు గంగాధర్‌ను బోల్సా గ్రామ సమీపంలో అడ్డగించారు. పోలీసులమంటూ బెదిరించి అతడి నుంచి రూ.వెయ్యి దోచుకుని తానూరు వైపు పారిపోయారు. గంగాధర్ అదే రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
పట్టించిన స్టిక్కర్
దారి దోపిడీకి పాల్పడిన వారి మోటార్‌సైకిల్ వెనుక భాగంలో బాడీబిల్డర్ స్టిక్కర్ ఉంది. బాధితుడు చెప్పి వివరాల ఆధారంగా పోలీసులు భైంసాతోపాటు బెల్‌తరోడా, బోల్సా బస్టాప్ వద్ద సీసీ పుటేజీ పరిశీలించారు. గంగాధర్ వాహనాన్ని వెంబడించిన దృశ్యంతోపాటు వాహనంపై స్టిక్కర్‌ను గమనించారు. దీని ఆధారంగా తానూరు గ్రామానికి చెందిన పున్నోడ ప్రకాష్‌గా గుర్తించారు. అదుపులోకి తీసుకుని విచారించగా విషయం బయట పడింది. తానూరుకు చెందిన ప్రకాష్, మహారాష్ట్రలోని భోకర్ తాలూకా బోరిగాం గ్రామానికి చెందిన పరమేశ్వర్ అతిగా మద్యం సేవించి దారి దోపిడీ చేసినట్లు అంగీకరించారు. ప్రకాష్‌ను అరెస్టు చేయగా.. పరమేశ్వర్ కోసం గాలిస్తున్నట్లు ఎస్సై తెలిపారు.


